ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 07:27 PM

తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన గురువారం నాటికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రమే నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ మను సింఘ్వీ, వేం నరేందర్‌ రెడ్డిలు తమ నామినేషన్లను ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి నామ పత్రాలు అందించారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాలు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు భారీగా అసెంబ్లీకి చేరుకున్నారు.


ఇక ఈ రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీది కాగా.. మరొకటి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ కి మరోసారి అవకాశం కల్పించారు. మరో స్థానానికి ఇప్పటివరకు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి .. ఇవాళే రాజీనామా చేసి.. మరో స్థానం కోసం పోటీ చేస్తున్నారు. ఇక అభిషేక్ మను సింఘ్వీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి దక్కించుకోనుంది. కానీ మరో స్థానం కోసం.. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ మద్దతు కోరనుంది.


ఈ సందర్భంగా తెలంగాణ నుంచి వరుసగా రెండోసారి రాజ్యసభకు వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నానని అభిషేక్‌ మను సింఘ్వీ వెల్లడించారు. సిట్టింగ్ సీటును ఆయనకే ఇస్తారనే ప్రచారంతో బుధవారం రోజున సాయంత్రమే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు అభిషేక్ మను సింఘ్వీ ధన్యవాదాలు చెప్పారు.


అభిషేక్ సింఘ్వీకి సీటు ముందే ఖరారు కాగా రెండో రాజ్యసభ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. చాలా మంది ఆశావహులు అనేక ప్రయత్నాలు చేయడం, ఢిల్లీ పెద్దలను కలవడం, తమకు అవకాశం ఇవ్వాలని కోరడం సహా సర్వశక్తులు ఒడ్డారు. ఇక అర్ధరాత్రి వరకు చర్చలు, సంప్రదింపులు జరిపిన తర్వాత వేం నరేందర్‌ రెడ్డికి అవకాశం ఇచ్చారు. సీఎం రేవంత్‌ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డికి.. రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆయన కోరం.. అందరితో మంచి సంబంధాలు ఉన్న వేం నరేందర్‌ రెడ్డికి ఇవ్వడంపై ఎవరి నుంచీ అభ్యంతరాలు రాకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా చివరికి అంగీకరించింది.


ఇక రెండో సీటుకు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపితే పోటీ ఉండేది. కానీ ఆ పార్టీ రాజ్యసభ ఎన్నికలపై మౌనం వహించింది. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తికి కనీసం 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా నామినేషన్ వేయడంతో అది స్క్రూటినీలో రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు పెద్దల సభలో అడుగుపెట్టడం ఇక లాంఛనం కానుంది.


దేశంలోని 15 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం గత నెల 26వ తేదీన నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలైంది. నేటితో నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కాగా.. రేపు (మార్చి 6వ తేదీన) వాటిని అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 9వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇక మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa