ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మేం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, కానీ నాయకత్వానికి మాత్రం దూరంగా'.. కడియం శ్రీహరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 06:16 PM

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వాగతించారు. తెలంగాణలో సంచలనం రేపిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఎట్టకేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయంతో ఒక కొలిక్కి వచ్చింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు రాగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్.. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట కల్పించారు. తాజాగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి , దానం నాగేందర్‌ల ఫిరాయింపు ఆరోపణలపై విచారణ జరిపిన గడ్డం ప్రసాద్ కుమార్.. వారికి కూడా క్లీన్‌చిట్ ఇవ్వడంతో.. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అయితే స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.


ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు సంబంధించిన పార్టీ ఫిరాయింపులపై విచారణ జరిపిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్.. ఇవాళ సంచలన తీర్పును ఇచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్ తీర్పును స్వాగతించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తమ లాంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ చట్టబద్ధం కాదని వెల్లడించారు. ఈ వ్యవహారంలో స్పీకర్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చిన తర్వాత కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు తెలిపారు.


తనకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కడియం శ్రీహరి తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఎన్నడు ప్రజల ముందుకు వచ్చి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడలేదని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. తాము అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు. తాము బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నామని స్పష్టం చేసిన కడియం.. కానీ ఆ పార్టీ నాయకత్వానికి మాత్రం దూరంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారని కడియం గుర్తు చేశారు.


బీఆర్ఎస్ పార్టీ చేసిన పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై ఈనెల 12వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకుని తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఆదేశాలు ఇవ్వగా.. ఆ గడువు ముగుస్తున్న వేళ వారికి క్లీన్‌చిట్ ఇచ్చారు. దీంతో తెలంగాణలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారని.. పలు స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలకు చెక్ పడినట్లయింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa