కేంద్ర ఆర్థిక శాఖ ఆసక్తికర ప్రకటన చేసింది. అదేమిటంటే ఏపీ, తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే.. తెలంగాణలో రైతులకు రుణభారం తక్కువగా ఉందట. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి పార్లమెంట్‌లో వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లో రైతులకు ఉన్న అప్పుల మొత్తంపై తమిళనాడు ఎంపీ ఎ.రాజా లోక్‌సభలో ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి మంగళవారం (మార్చి 10) లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2025 డిసెంబరు 31 నాటికి తమిళనాడు అన్నదాతలపై రూ.5,06,290.45 కోట్లు, ఏపీ రైతులపై రూ.3,75,254.59 కోట్లు, కర్ణాటక రైతులపై రూ.2,10,244.47కోట్ల అప్పుల భారం ఉందని వెల్లడించారు. ఇదే సమయంలో తెలంగాణ అన్నదాతలపై మాత్రం రూ.1,75,960.56 కోట్ల అప్పు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
ఇక బహిరంగ మార్కెట్ నుంచి రుణాల సేకరణలో తెలంగాణ ప్రభుత్వం మూడో స్థానంలో నిలిచిందని కేంద్రం స్పష్టం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.69,300 కోట్ల అప్పు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు. రాష్ట్రాల రుణాలపై మంగళవారం రాజ్యసభలో వైసీపీ సభ్యుడు గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర రూ.99 వేల కోట్లు, తమిళనాడు రూ.95 వేల కోట్లు తర్వాత మార్కెట్ నుంచి అత్యధిక మొత్తం రుణాలు సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ రూ.60 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.56 వేల కోట్లు రుణాలు సేకరించినట్లు తెలిపారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో పలు విడతల్లో రుణామాఫీ చేసింది. దాదాపు 25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేశారు. అందుకు రూ.21 వేల కోట్లకుపైగా నిధులు విడుదల చేశారు. ఈ కారణంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రైతులకు తక్కువ అప్పులున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అంటున్నారు. అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa