తెలంగాణలో ఏసీబీ అధికారుల దాడుల్లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రావణ్ కుమార్ దొరికిపోయారు. కరీంనగర్ విద్యానగర్‌లోని కమటం శ్రావణ్ కుమార్ నివసించే అపార్ట్‌మెంట్ సహా జ్యోతినగర్‌లో ఉన్న ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సుమారు రూ.4 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను శ్రావణ్ కుమార్ కూడబెట్టినట్లు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.40 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
కరీంనగర్‌లోని విద్యానగర్, ముక్రంపుర పరిధిలో శ్రావణ్ కుమార్‌కు రెండు ఇళ్లు, ఒక అపార్ట్‌మెంట్‌లో (6 ఫ్లాట్లు), 4 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఇక అతడికి పలు లగ్జరీ కార్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు రూ.11.90 లక్షల నగదు.. రూ.4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువ ఆస్తులు శ్రావణ్ కుమార్ భార్య కమటం దీప్తి పేరు మీద రిజిస్ట్రేషన్ కావడం గమనార్హం. ఏసీబీ అధికారులు సోదాలు చేయనున్నారనే సమాచారం అందుకున్న శ్రావణ్ కుమార్ కుటుంబ సభ్యులు సుమారు రూ.10 లక్షల డబ్బు ఉన్న బ్యాగ్‌ను ఇంట్లో నుంచి బయటికి విసిరేసినట్లు వెల్లడైంది. అయితే ఆ బ్యాగ్‌ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని రికవరీ కింద నమోదు చేశారు.
అంచలంచలుగా....
కరీంనగర్ జిల్లా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా మొదట ఉద్యోగంలో చేరిన శ్రావణ్ కుమార్.. ఆ తర్వాత ప్రమోషన్ పొందాడు. ఈ క్రమంలోనే అర్బన్ తహసీల్దార్ ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి సాధించాడు. ఆ తర్వాత అక్కడే డిప్యూటీ తహసీల్దార్, ఉమ్మడి జిల్లా కలెక్టర్ల వద్ద సీసీగా కూడా పనిచేశాడు. ప్రస్తుతం గజ్వేల్ మండలంలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న శ్రావణ్ కుమార్.. బినామీల పేరు మీద పదుల ఎకరాల వ్యవసాయ భూములను కూడా రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. శ్రావణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa