హైదరాబాద్ :తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీలపై భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి. రామారావు (కేటీఆర్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలు అనేక సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో ఇటువంటి క్రీడా కార్యక్రమాలలో పాల్గొని సమయం వృథా చేయడం తగదని స్పష్టం చేశారు.మేము ఎమ్మెల్యేలుగా ఈ క్రీడా పోటీలలో పాల్గొనబోమని కేటీఆర్ వెల్లడించారు. సభను కనీసం ఇంకో 10 రోజులు కొనసాగించి ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అనేక కీలక అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.ప్రజలకు సంబంధించిన సమస్యలను పక్కనబెట్టి, అర్థాంతరంగా అసెంబ్లీని వాయిదా వేసి క్రీడలు నిర్వహించడం ప్రజలు సమర్థించరని, ఇది మంచి పరిణామం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం కూడా ఈ క్రీడా పోటీలపై పునరాలోచన చేయాలని సూచించారు.“మేము క్రీడలు ఆడి ఒలింపిక్స్‌కి వెళ్లేది ఏమీ లేదు. క్రీడలను ప్రోత్సహించాలంటే పిల్లలకు అవకాశాలు కల్పించి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆటలు ఆడించడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు” అని కేటీఆర్ పేర్కొన్నారు.
అయితే, ఎవరైనా క్రీడల్లో పాల్గొనాలనుకుంటే ముందుగా ప్రజా సమస్యలపై చర్చలు పూర్తిచేసి, శాసనసభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత రెండు రోజులపాటు క్రీడలు నిర్వహించుకోవచ్చని సూచించారు. అసెంబ్లీ వాయిదా వేసి క్రీడలు నిర్వహించడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. ఈ పరిణామాలు చూస్తే ప్రభుత్వానికి ప్రజా సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు.ఇదిలా ఉండగా, హైదరాబాద్ జింఖానా గ్రౌండ్‌లో నిర్వహించిన విమెన్స్ డాక్టర్స్ క్రికెట్ లీగ్ సీజన్-4 కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటుడు సాయి కుమార్, బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, మహిళా వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన కేటీఆర్, విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. మహిళా వైద్యులకు సంబంధించిన ఈ లీగ్ ద్వారా వచ్చిన ప్రైజ్ మనీని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతులకు ఉపయోగపడేలా వినియోగించడం అభినందనీయమని అన్నారు.“మహిళా వైద్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు మరెన్నో జరగాలి” అని కేటీఆర్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa