భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం మంగళవారం నేత్రపర్వంగా సాగింది. వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించిన మండపంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ స్థానాచార్యులు కే. ఈ. స్థలశాయి, వేద పండితులు గిరిధరాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు ప్రసాదాచార్యులు తదితరులు శాస్త్రోక్తంగా స్వామి వారి కల్యాణాన్ని జరిపించారు. కాళ్లూరి వంశీయులు శివరాజ్ దంపతులు, శివాలయం పునఃనిర్మాణకర్త మారగాని శ్రీనివాసరావు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ మేనేజర్ పాకాల వెంకటరమణ పర్యవేక్షించారు. కల్యాణం అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ మాజీ చైర్మన్ వనమా గాంధీ, మరగాని శ్రీనివాసరావు, కల్లోజి వెంకటేష్, దోసపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.