భద్రాచల రామాలయం భద్రతను సవాల్ చేసే ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలకు ఆలయ ఈఓ రమాదేవి శ్రీకారం చుట్టారు. భద్రత నిమిత్తం సీసీ కెమెరా వ్యవస్థ, సెక్యూరిటీ గార్డులు, హోంగార్డులు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నప్పటికీ డొల్లతనం బట్టబయలైంది. ఈ అంశంపై ఈఓ ఇటీవల సుదీర్ఘ సమీక్షలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులను పెద్ద బ్యాగులతో దర్శనానికి అనుమతించ వద్దని మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో ఉండే సెక్యూరిటీ సిబ్బంది ఈ అంశంపై భక్తులతో మర్యాదగా వ్యవహరించి వారికి అవగాహన కల్పించాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. పెద్ద సంచులు ఉంటే కౌంటర్లలో లేదా వసతి గదుల్లో గానీ భద్రపరిచేలా సెక్యూటిరీ సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ఈ నిబంధన ఆలయ కార్యాలయ సిబ్బందితో పాటు వైదిక ఉద్యోగులకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. మతపరమైన సిబ్బంది తమకు అవసరమైన పారాయణం వంటి పుస్తకాలను తీసుకురావాలనుకుంటే తగిన చిన్నబ్యాగులకు అనుమతి ఉంటుందని, పెద్ద సంచులకు అవకాశం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సంచుల్లో ఆలయానికి చెందిన వస్తువులు ఉన్నట్లు అనుమానం కలిగితే తనిఖీ చేసి తనకు సమాచారం ఇవ్వాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఆలయం వద్ద సెల్ ఫోన్ ఉపయోగించవద్దనే ఉత్తర్వులు ఇప్పటికే ఉన్నాయి. ఇదంతా భద్రత కోసమేనని, అందరూ సహకరించాలని ఈఓ కోరారు.