కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని వర్గాల వారి కోసం ప్రత్యేక పథకాల్ని తీసుకొచ్చింది. ఆడపిల్లలకు ఆర్థిక భద్రత చేకూర్చేందుకు, ఆడపిల్లల తల్లిదండ్రులకు సాయంగా ఉండేందుకు పిల్లల పైచదువులు, పెళ్లిళ్లు జరిపేందుకు పెద్ద మొత్తంలో నిధి సమకూర్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన గొప్ప పథకం సుకన్య సమృద్ధి యోజన. దీంట్లో పదేళ్ల లోపు ఆడపిల్లల్ని చేర్పించొచ్చు. ఇక వడ్డీ రేటు ప్రస్తుతం 8.2 శాతంగా ఉండగా.. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో దీంట్లోనే వడ్డీ ఎక్కువగా ఉంది. ఇక వరుసగా 15 ఏళ్లు ఈ స్కీంలో డబ్బులు కట్టాలి. ఏడాదికి కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయాలి. ఇంకా ఆదాయపు పన్ను చట్టం కింద సెక్షన్ 80c ద్వారా ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల పన్ను తగ్గించుకోవచ్చు. మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు.
అంటే అకౌంట్ తెరిచిన 21 ఏళ్లకు అకౌంట్లోనుంచి మొత్తం డబ్బులు మీ చేతికి వస్తాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో సుకన్య సమృద్ధి అకౌంట్ నిధుల్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది దీర్ఘకాల వ్యవధి ఉన్న స్కీమ్ అయినా కూడా కొన్ని బలమైన కారణాలతో ముందుగా కూడా డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
>> అకౌంట్ హోల్డర్ అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చినా లేదా పదో తరగతి విద్య పూర్తి చేసినా విద్యా ప్రయోజనాల కోసం నగదు అవసరాలకు ఈ అకౌంట్ ఉపసంహరించుకోవచ్చు. గత సంవత్సరంలో అకౌంట్లో ఉన్న మొత్తంలో 50 శాతం మాత్రమే వెనక్కి తీసుకోవచ్చు.
>> అమ్మాయికి 18 ఏళ్లు నిండాక .. పెళ్లికి సంబంధించి.. పెళ్లికి ఒక నెల ముందు లేదా పెళ్లి జరిగిన 3 నెలలకు అకౌంట్లోని మొత్తం ఉపసంహరించుకోవచ్చు.
>> అకౌంట్ హోల్డర్ అయిన అమ్మాయి దురదృష్టవశాత్తు చనిపోయిన సమయంలో.. అకౌంట్‌కు సంబంధించిన హక్కు ఖాతా ప్రారంభించిన వ్యక్తికి వస్తుంది. డెత్ సర్టిఫికెట్ పత్రం సమర్పించి.. డిపాజిట్ నిల్వ మొత్తం వడ్డీతో సహా తీసుకోవచ్చు.
>> అకౌంట్ ప్రారంభించిన అమ్మాయికి భారత పౌరసత్వం ఉన్నా కూడా .. తర్వాత డిపాజిట్ కాలవ్యవధిలో దేశ పౌరసత్వం కోల్పోతే అకౌంట్ క్లోజ్ చేయాలి. ఈ వివరాల్ని సంబంధిత శాఖకు తెలపాలి.
>> ఖాతా తెరిచిన తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మరణించిన టైంలో ఖాతాదారైన అమ్మాయికి ఆర్థిక సమస్యలు లేదా ఇతర సమస్యలు వస్తే అకౌంట్ ఓపెన్ చేసిన ఐదేళ్లకు అకౌంట్ క్లోజ్ చేయొచ్చు.
>> ఖాతా ఉన్న అమ్మాయికి ఏదైనా ప్రాణాంతక సమస్య, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు వంటి తీవ్రమైన పరిస్థితుల్లో సంబంధిత పత్రాలు సమర్పించి.. అకౌంట్లో మొత్తాన్ని వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు. ఈ సమయంలో అకౌంట్ కూడా ముందుగానే క్లోజ్ చేయొచ్చు.