సార్వత్రిక ఎన్నికల తొలి విడత అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన మార్చి 28న జరగనుంది. అదేవిధంగా మార్చి 30న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలను ఎన్నికల సంఘం ఏడు దశల్లో నిర్వహించనుంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది.
అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు, సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఔటర్ మణిపూర్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 21 రాష్ట్రాల్లో తొలి దశ ఎన్నికలను ఈసీ నిర్వహించనుంది. 10 రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు ముగియనున్నాయి. జూన్ 4న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.