భారతీయ స్టేట్ బ్యాంక్ మరో శుభవార్త చెప్పింది. చాలా బ్యాంకులు స్పెషల్ డిపాజిట్ పథకాల్ని అమలు చేస్తున్న క్రమంలో ఎస్‌బీఐ కూడా గతంలో అధిక వడ్డీ ఆఫర్ చేస్తూ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్ని లాంఛ్ చేశాయి. వీటిల్లో ఎస్‌బీఐ అమృత్ కలశ్, ఎస్‌బీఐ వీకేర్, ఎస్‌బీఐ సర్వోత్తమ్ ఎఫ్‌డీ, ఎస్‌బీఐ గ్రీన్ డిపాజిట్ వంటివి ఉన్నాయి. రెగ్యులర్ సిటిజెన్లకు, సీనియర్ సిటిజెన్లకు ఇతర రెగ్యులర్ డిపాజిట్లతో పోలిస్తే వీటిల్లో ఎక్కువ వడ్డీ వస్తుంది. అయితే SBI లో అత్యధిక వడ్డీ అందించే పథకం అమృత్ కలశ్. దీని గడువు మార్చి 31తో ముగియగా.. మరో 6 నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీనియర్ సిటిజెన్లకు స్పెషల్ స్కీమ్- ఎస్‌బీఐ వీకేర్ గడువు కూడా మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఎస్‌బీఐ వీకేర్ స్కీమ్ విషయానికి వస్తే ఇది కేవలం సీనియర్ సిటిజెన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ స్కీం వ్యవధి మార్చి 31తోనే ముగియగా.. ఇప్పుడు 2024, సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. 60 ఏళ్లు పైబడిన వారే అర్హులు. దీంట్లో గరిష్టంగా 7.50 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. డిపాజిట్ కనీస కాలవ్యవధి ఐదేళ్లు. గరిష్టంగా పదేళ్ల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజెన్లకు సాధారణ ప్రజలతో పోలిస్తే అదనంగా అందించే 50 బేసిస్ పాయింట్లతో పాటు.. కార్డు రేటుపై 50 బేసిస్ పాయింట్లు కలిపి మొత్తం 100 బేసిస్ పాయింట్లు అదనంగా వీకేర్ కింద అందిస్తున్నట్లు తెలిపింది ఎస్‌బీఐ. నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా లేదా బ్యాంకుకు నేరుగా వెళ్లి ఈ స్కీంలో చేరొచ్చు. రూ. 2 కోట్ల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ హామీగా లోన్ కూడా తీసుకోవచ్చు.
ఈ స్కీంలో 7.50 శాతం వడ్డీ చొప్పున రూ. లక్ష డిపాజిట్ చేసినట్లయితే ఐదేళ్లలో వడ్డీ రూ. 37,333 వస్తుంది. మొత్తం చేతికి రూ. 1,37,333 అందుతుంది. ఇదే పదేళ్లకు అయితే రూ. 74,824 వడ్డీ పొందుతారు.
ఇక ఎస్‌బీఐ ఇతర రెగ్యులర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయానికి వస్తే.. వారం నుంచి పదేళ్ల వ్యవధి డిపాజిట్లపై కనిష్టంగా 4 శాతం నుంచి గరిష్టంగా 7.50 శాతం వడ్డీ అందిస్తోంది. అత్యధికంగా రెండేళ్ల నుంచి మూడేళ్ల టెన్యూర్ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీ వస్తోంది.
ఇక ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీం కింద 400 రోజుల వ్యవధిపై రెగ్యులర్ సిటిజెన్లకు 7.10 శాతం వడ్డీ.. సీనియర్ సిటిజెన్లకు 7.60 శాతం వడ్డీ వస్తోంది. దీని గడువు కూడా 6 నెలలపాటు పొడిగించింది. దీంట్లో కూడా లోన్ సదుపాయం ఉంది.