స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్క్ అని తెలిసిందే. అయితే, సరైన సమయంలో సరైన స్టాక్‌ని ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెడితే చాలా తక్కువ టైం లోనే ఎన్నో రెట్లు లాభాలు అందుతాయని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు ఆ కోవకే చెందిన ఓ పెన్నీ స్టాక్ తమ షేర్ హోల్డర్ల దశ తిప్పింది. మిలియనీర్లను చేసింది. అదే లోరెంజిని అప్పేరల్స్ లిమిటెడ్ స్టాక్. ఈ షేర్లు కొన్నవారికి కేవలం మూడేళ్లలోనే ఏకంగా 5000 శాతం మేర లాభాలు అందాయి. లక్ష పెట్టిన వారికి రూ.50 లక్షలు వచ్చినట్లయింది.
ఇవాళ్టి ట్రేడింగ్ చూసుకుంటే ఈ స్టాక్ 2 శాతం నష్టంతో రూ.27.95 వద్ద ముగిసింది. క్రితం రోజు రూ.28.50 వద్ద ఉండేది. అలాగే ఈ స్టక్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.33.02 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ స్థాయి 6.78 శాతంగా ఉంది. లోరెంజిని అప్పేరల్స్ లిమిటెడ్ కంపెనీని 2007లో ఏర్పాటు చేశారు. మొంటెయిల్ బ్రాండ్ ద్వారా పురుషులు, మహిళల కోసం దుస్తులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తుంది. తమ ప్రత్యేకమైన స్టోర్లతో పాటు ఆన్‌లైన్ ద్వారానూ విక్రయిస్తోంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.437 కోట్లుగా ఉంది.
అందరికి షేర్లు అందుబాటులో ఉండేలా చూసుకేందుకు ఈ కంపెనీ ఇటీవలే స్టాక్ స్ప్లిట్ నిర్వహించింది దాంతో పాటు బోనస్ షేర్లు జారీ చేసింది. మార్చి 28, 2024నే షేర్లు అందించింది. 11 షేర్లు ఉన్న వారికి 6 షేర్లు బోనస్ గా అందించింది. మరోసారి బోనస్ షేర్లు జారీ చేసేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ, బీఎస్ఈ లిమిటెడ్ నుంచి ఏప్రిల్ 15, 2024 రోజునే ట్రేడింగ్ అప్రూవల్ పొందింది కంపెనీ. మరోవైపు.. గత ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలో కంపెనీ నెట్ సేల్స్ 4.3 శాతం పెరిగి రూ.13 కోట్లుగా నమోదైంది. అలాగే నెట్ ప్రాఫిట్ 1294 శాతం పెరిగి రూ.2.37 కోట్లుగా నమోదైంది.
ఈ కంపెనీ స్టాక్ పని తీరు గమనిస్తే గత ఏడాది కాలంలో 275 శాతం మేర రిటర్న్స్ అందించింది. అలాగే గత మూడేళ్లలో చూసుకుంటే ఈ స్టాక్ 5 వేల శాతం పెరిగింది. అలాగే గత 5 ఏళ్లలో 7 వేల శాతం పెరగడం గమనార్హం. అంటే ఐదేళ్ల క్రితం రూ.1 లక్ష షేర్లు కొనుగోలు చేసినట్లయితే.. ఇప్పుడు వాటి విలువ రూ.70 లక్షలకుపైగా ఉంటుంది. గమనిక.. ఈ వార్తా కథనం కేవలం సమాచారం కోసం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఎలాంటి స్టాక్ రికమండ్ చేయడం లేదు.