దేశంలోని దిగ్గజ రిటైల్ సూపర్‌మార్కెట్ చెయిన్ డీమార్ట్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. మన ఇంట్లోకి కావాల్సిన దాదాపు అన్ని వస్తువులు కూడా అక్కడ ఒకేచోట మనకు అందుబాటులో ఉంటాయి. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు కావాల్సిన వస్తువులు అన్నీ లభ్యం అవుతుంటాయి. డీమార్ట్ స్టోర్లు దేశంలో ఇప్పుడు పాపులర్. డీమార్ట్ కేంద్రాల్లో జనం తాకిడి ఎప్పుడూ ఉంటుంది. బిల్ పేమెంట్స్ చేసేందుకు గంటలకు గంటలు ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే ఈ డీమార్ట్ స్టోర్లను అవెన్యూ సూపర్‌మార్ట్స్ నిర్వహిస్తుంటుంది. దీనికి లాభాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయి. డీమార్ట్ ఫౌండర్ రాధాకిషన్ దమానీ. ఇక ఈ కంపెనీ ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది.
జనవరి- మార్చి (Q4) క్వార్టర్‌కు సంబంధించి ఫలితాల్ని ఈ సంస్థ శనివారం ప్రకటించింది. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం ఏకంగా రూ. 563 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో లాభం రూ. 460 కోట్లు కాగా.. ఇప్పుడు 22.4 శాతం పెరిగింది. కంపెనీ ఆదాయం కూడా 20 శాతం పెరిగి రూ. 12,727 కోట్లకు చేరింది. ఇక ఎబిటా 22.3 శాతం పుంజుకొని.. రూ. 943 కోట్లుగా ఉంది. ఎబిటా అంటే టాక్సులకు ముందు లాభం. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13 బేసిస్ పాయింట్ల వృద్ధితో 7.41 శాతంగా ఉంది.
మార్చి త్రైమాసికంలో లాభాలు పెరిగేందుకు ప్రధాన కారణం జనరల్ మర్చండైజ్ (సాధారణ వస్తువులు) సహా దుస్తుల వ్యాపారం పెరగడం అని కంపెనీ ఫలితాల సందర్భంగా వెల్లడించింది. ఫలితాల సందర్భంగా కంపెనీ సీఈఓ, ఎండీ నెవిల్లే నోరోన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధి కనబరిచామని అన్నారు. రెండేళ్లు లేదా అంతకంటే ముందు ప్రారంభించిన డీమార్ట్ స్టోర్లు కిందటి ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతం మేర వృద్ధి కనబరిచాయని చెప్పారు నెవిల్లే. ఇక అంతకుముందు డీమార్ట్ స్టోర్లు దేశవ్యాప్తంగా 284 ఉండగా.. కొత్తగా 41 స్టోర్లు తెరిచామని.. ఇప్పుడు మొత్తం స్టోర్ల సంఖ్య 365కు చేరిందని వెల్లడించారు.
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ డీమార్ట్ స్టోర్లు ఇప్పుడు దేశంలోని 23 నగరాల్లో ఉనికిలో ఉండగా.. రానున్న రోజుల్లో మరికొన్ని నగరాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. క్యూ4లో కొత్తగా 24 డీమార్ట్ స్టోర్లు ప్రారంభమైనట్లు తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, దమన్ దీవ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, NCR, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌ల్లో మొత్తం 15.15 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ బిజినెస్ ఏరియా ఉంది. ఇక డీమార్ట్ షేరు ప్రస్తుతం రూ. 4618.45 వద్ద ఉండగా.. మార్కెట్ విలువ ఏకంగా రూ. 3.01 లక్షల కోట్లు.