ఖలీస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులను కెనడా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. గతేడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని ఓ గురుద్వారా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నిజ్జర్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితులను కొద్ది నెలల కిందటే గుర్తించిన దర్యాప్తు అధికారులు, వారి కదలికలపై పటిష్ట నిఘా పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కెనడా బ్రాడ్‌క్యాస్టింగ్ కార్పొరేషన్ (సీబీసీ) కథనం వెలువరించింది. ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసినట్టు తెలిపింది. వారిని కరన్ బ్రార్ (22), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరన్‌ప్రీత్ సింగ్ (28)గా గుర్తించినట్టు పేర్కొంది. ముగ్గురిపై హత్యకు మారణాయుధాల వినియోగం, కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు చెప్పింది. ఎడ్మాంటన్‌లో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఈ అరెస్ట్‌పై బ్రిటిష్ కొలంబియా గురుద్వార్ కౌన్సిల్ అధికార ప్రతినిధి మోనిందర్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. నిజ్జర్ కుటుంబం, సిక్కు సమాజం పది నెలల నిరీక్షణ తర్వాత గొప్ప ముందడుగు పడిందని, దీని ద్వారా హత్యకు ముందు ఏం జరిగిందో సరైన సమాచారం వస్తుందని అన్నారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్రపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందంటూ గతేడాది సెప్టెంబరులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలతో భారత్, కెనడాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కెనడా ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్.. అవన్నీ నిరాధారమైన ఆరోపణలని తేల్చిచెప్పింది.
ఇక, నిజ్జార్ హత్య కేసులో దర్యాప్తునకు సహకరించాలని కూడా భారత్‌ను కోరింది. తమకు సమాచారం ఇస్తే దర్యాప్తు జరిపిస్తామని భారత్ స్పష్టం చేసింది. కెనడా పౌరసత్వం ఉన్న హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఖలీస్థాన్ వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టిన నిజ్జార్‌పై భారత్‌లో పలు కేసులు ఉన్నాయి. ఇక, అమెరికాలో ఆశ్రయం పొందుతున్న మరో ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కూడా కుట్ర జరిగిందని అగ్రరాజ్యం ఆరోపించింది. ఈ కుట్రను తమ పోలీసులు భగ్నం చేశారని, ఓ భారతీయుడ్ని అరెస్ట్ చేశారని తెలిపింది. ఇటీవల దీనిపై వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురిస్తూ.. పన్నూన్ హత్యకు కుట్రలో రా అధికారి వీరేంద్ర యాదవ్ ఉన్నాడని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. అమెరికా కూడా స్పందిస్తూ తాము న్యూఢిల్లీతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.