ఓ మాజీ మంత్రి భార్య పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన కజికిస్థాన్‌లో చోటుచేసుకుంది. భార్యను మాజీ మంత్రి కొడుతున్న దృశ్యాలు సీసీటీవీ రికార్డయ్యాయి. ఈ వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం కజికిస్థాన్‌ను కుదిపేస్తోంది. నిందితుడు అధికార పార్టీకి చెందిన వాడే కావడంతో అధ్యక్షుడు కస్సిమ్ జోమార్ట్ టోకాయేవ్‌ను ఈ అంశం ఇరకాటంలో పడేసింది. అయితే, దీనిపై పారదర్శకంగా విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గత నవంబరులో మాజీ మంత్రి కుయాండిక్ బిషింబాయేవ్ భార్య సాల్తానాట్ నుకెనోవా (31) ఓ రెస్టారెంట్‌లో అనుమానాస్పదంగా మృతిచెందారు. కుయాండిక్ బంధువులకు సంబంధించిన ఆ రెస్టారెంట్‌లో దంపతులు రోజంతా ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కోర్టు విచారణ సందర్భంగా రెస్టారెంట్‌లో దంపతులు ఉండగా రికార్డయిన సీసీటీవీ దృశ్యాలు ప్రదర్శించారు. 8 గంటల నిడివి ఉన్న ఈ వీడియోలో కజికిస్థాన్ ఆర్ధిక శాక మాజీ మంత్రి కుయాండిక్.. భార్య సాల్తానాట్‌ను దారుణంగా కొట్టడం స్పష్టం కనిపిస్తోంది. ఆమెపై పిడుగుద్దులు కురిపించి, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు. అతడి నుంచి తప్పించుకోడానికి టాయ్‌లెట్‌లోకి వెళ్లి దాక్కుంటే.. తలుపు బద్దలుకొట్టి.. బయటకు లాక్కొచ్చాడు. విచక్షణారహితంగా ఆమెపై దాడిచేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని ప్రాసిక్యూటర్ తెలిపారు. రక్తపు మడుగులో ఆమె అచేతనంగా పడి ఉంటే.. ఆమె ప్రాణాలతో ఉంటుందా? అని జ్యోతిషుడికి ఫోన్ చేసి అడిగాడు ఘటన జరిగిన 12 గంటల తర్వాత అంబులెన్స్ అక్కడకు చేరుకోగా.. వైద్య సిబ్బంది ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె మెదడుకు తీవ్రగాయం వల్లే చనిపోయినట్టు వెల్లడయ్యింది. ముక్కు ఎముక విరిగిపోగా.. ముఖం, తల, చేతులపై అనేక గాయాలున్నట్టు తేలింది. అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన మాజీ మంత్రిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఇవన్నీ నిరూపితమైతే అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.
దోషిగా నిర్దారణ అయి శిక్షపడినా డబ్బు, పలుకుబడి ఉన్న బిషింబాయేవ్ తప్పించుకునే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక, వరకట్న వేధింపుల కేసులో 2017లో అరెస్టయిన మాజీ మంత్రికి పదేళ్ల జైలు శిక్ష పడింది. అయినా సరే మూడేళ్లకే బయటకు వచ్చేశాడని గుర్తుచేస్తున్నారు. అధికార పార్టీ నాయకుడు కావడంతో అండదండలు పుష్కలంగా ఉంటాయని, ఏమీ చేయలేమని అంటున్నారు.