సొంత ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయాలనుకోవడం.. మధ్యతరగతి కుటుంబానికి పెద్ద కలగా ఉంటుంది. దీనిని నెరవేర్చుకునేందుకు సంపాదనలో ముందునుంచే పెద్ద మొత్తంలో పొదుపు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా.. హోం లోన్ కూడా కచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనతో బ్యాంక్ లోన్ కోసం చూస్తుంటారు కానీ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయనేది పెద్దగా ఆలోచించేలా చేయదు. ఈఎంఐ కట్టే సమయంలో మాత్రం.. పెరుగుతున్న ఖర్చులు సహా ఈఎంఐ బాదుడు చూసి భయపడుతుంటారు. ఆర్బీఐ రెపో రేట్లను వరుసగా పెంచుకుంటూ పోయిన క్రమంలో దాదాపు అన్ని బ్యాంకులు కూడా అన్ని రకాల లోన్లపై వడ్డీ రేట్లను గరిష్ట స్థాయిలకు చేర్చాయి.
వడ్డీ రేట్ల పెరుగుదలతో.. ఇంటి ఓనర్లు, కొనుగోలుదారులు తమ ఆర్థిక వ్యూహాల్ని పునఃపరిశీలించాలని సూచిస్తున్నారు నిపుణులు. పెరుగుతున్న ఈఎంఐ ప్రభావాన్ని తగ్గించేందుకు మార్గాల్ని అన్వేషించాలని సూచిస్తున్నారు. అందుకే హోం లోన్లపై ఈఎంఐ బాదుడు నుంచి తప్పించుకునేందుకు నిపుణుల సూచనల్ని ఒకసారి తెలుసుకుందాం.
>> ముందస్తు చెల్లింపుల్ని ఎంచుకోవడం వల్ల లోన్ టెన్యూర్, వడ్డీ చెల్లింపుల్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మీ హోం లోన్‌పై ఉన్న వడ్డీ రేటు కంటే ఎక్కువ రాబడి పొందగల ఏదైనా పెట్టుబడి అవకాశాల్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. లోన్ ముందస్తుగా చెల్లించే బదులు అదనపు నిధుల్ని పెట్టుబడి పెట్టడం మరింత బెనిఫిట్‌గా ఉండొచ్చు. మిగులు నిధుల్ని కలిగి ఉంటే.. గణనీయమైన లోన్ టెన్యూర్ ఉంటే రుణాన్ని పాక్షికంగా ముందస్తుగా చెల్లించే అంశాన్ని పరిశీలించాలి. ఇది EMI లను తగ్గిస్తుంది. లోన్ పదవీ కాలాన్ని కూడా మార్చకుండా ఉంచుతుంది.
>> రానున్న రోజుల్లో వడ్డీ రేట్ల పెంపు కోసం ముందే సిద్ధం అయ్యేందుకు.. హోం లోన్ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఎంచుకోవడం మంచిది. ఈ సదుపాయంతో మీ హోం లోన్ అకౌంట్‌కు లింక్ చేసిన సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. ఎవరైనా పెద్ద మొత్తంలో చెల్లింపులు లేదా బోనస్ లేదా అసాధారణమైన పెంపు స్వీకరిస్తే ఈ డబ్బుల్ని HLOD అకౌంట్లో జమ చేయడం ద్వారా పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడం సాయపడుతుంది.
>> బడ్జెట్ లోటు, మిగులు నిధులు లేని సందర్భాల్లో.. ఈఎంఐ చెల్లింపుల్ని మునుపటి స్థాయిలోనే ఉంచేందుకు లోన్ టెన్యూర్ పొడిగించాలని కోరొచ్చు. ఉదాహరణకు చూస్తే 20 ఏళ్ల టెన్యూర్‌కు 7 శాతం వడ్డీ రేటు లెక్కన రూ. 30 లక్షల హోం లోన్ మీరు తీసుకున్నారనుకుందాం. అప్పుడు ఈఎంఐ దాదాపుగా రూ. 38,765 గా ఉంటుంది. వడ్డీ రేటు 2 శాతం పెరిగితే.. ఈఎంఐ రూ. 44,986 కు పెరుగుతుంది. అదే ఈఎంఐని రూ. 38,765 ఉంచుతూ.. టెన్యూర్ ఇంకొన్నేళ్లకు పొడిగించమని కోరొచ్చు. అయితే ఇది సరైన ఎంపిక కాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సంవత్సరాలు ఈఎంఐ, వడ్డీ చెల్లించాలి.