గత మండల, మకరవిళక్కు సీజన్‌లో శబరిమల అయ్యప్ప దర్శనం కోసం కనీవినీ ఎరుగునిరీతిలో భక్తులు పోటెత్తారు. దీంతో శబరిపీఠం నుంచి పంబ వరకూ కిలోమీటర్ల మేర క్యూలైన్లు వ్యాపించి.. భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ వాహనాలు బారులు తీరి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు, అధికారుల తీరుకు నిరసనగా భక్తులు కొన్నిచోట్ల ఆందోళనలకు దిగారు. అయితే, అటు కేరళ సర్కారు కూడా సరైన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. పోలీసులు, అధికారుల మధ్య సమన్వయలోపం కొట్టిచ్చినట్టు కనిపించింది. దర్శనాలు లేకుండానే వేలాది మంది భక్తులు వెనుదిరిగారు.
వీటిన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ముందుగానే మేల్కొంది. వచ్చే మండల, మకరువిళక్కు సీజన్ కోసం ఇప్పటి నుంచే సమయాత్తమవుతోంది. మే 4న జరిగిన బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శబరిమలలో అమలవుతోన్న స్పాట్ బుకింగ్‌లను రద్దు చేయాలని నిర్ణయించారు. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. శబరిమలకు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీబీ తెలిపింది.
దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లో కేవలం వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్నవారినే దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. రోజుకు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా దర్శనానికి 80,000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు. గతంలో 10 రోజుల ముందు మాత్రమే టిక్కెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా, దానిని మూడు నెలల ముందు వరకు టీడీబీ పెంచింది. ఇదిలా ఉండగా, తిరువాభరణాల ఊరేగింపు, మకర జ్యోతి సమయంలో ఆన్‌లైన్ బుకింగ్‌ను అనుమతించాలా? వద్దా? అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది నవంబరు 15 నుంచి మండల, మకరువిళక్కు పూజల సీజన్ మొదలవుతుంది. జనవరి 14,2025న మకరజ్యోతి దర్శనం ఉంటుంది.