ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాఖండ్‌‌ అడవుల్లో కార్చిచ్చుతో జనజీవనం అస్తవ్యస్తం.. 3 రోజుల్లో నలుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 10:04 PM

ఉత్తరాఖండ్‌ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపుచేయడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ నాలుగు రోజుల కిందట రంగంలోకి దిగి.. హెలికాప్టర్ల సాయంతో నీటిని వెదజల్లి మంటలను ఆర్పుతున్నాయి. అయినా, మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ మంటలకు గత మూడు రోజుల్లోనే నలుగురు మృతిచెందడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అల్మోరా జిల్లాలోని ప్రముఖ క్షేత్రం దునగిరి ఆలయాన్ని శనివారం మంటలు చుట్టిముట్టాయి. ఆ మంటల నుంచి తప్పించుకోడానికి భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టడం వీడియోల్లో రికార్డయ్యింది. మంటలు వేగంగా వ్యాపించడానికి బలమైన గాలుల కారణమని అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. దునగిరి పూజారులు, అటవీ శాఖ బృందం అప్రమత్తం కావడంతో భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.


కార్చిచ్చుతో గత నెలలో ప్రారంభించిన ఆదిశంకర హెలికాప్టర్ సర్వీసులను వరుసగా రెండో రోజు నిలిపివేశారు. అలాగే, పొగలు దట్టంగా వ్యాపించడంతో పితోర్‌గఢ్‌లోని నైని-శైని విమానాశ్రయానికి విమాన రాకపోకలు ఆగిపోయాయి. కార్చిచ్చు కారణంగా బూడిద ఎక్కడక్కడ పేరుకుపోయి.. ఊపిరి తీసుకోడానికి కూడా కష్టమవుతోందని స్థానికులు వాపోతున్నారు. కార్చిచ్చుతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. హల్ద్వానీ రహదారిని బండరాళ్లు కప్పేశాయి. ‘పగలు రాత్రి తేడా లేకుండా మంటలకు కొండలు ఆహుతవుతున్నాయి.., దట్టమైన పొగతో ఏమీ కనిపించడం లేదు.. ఇది దాదాపు ప్రపంచ అంతమే’ అని ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు.


చమోలీ జిల్లాలో కీవీ పండ్ల తోటలకు మంటలు వ్యాపించాయి. అలాగే, ఎత్తైన కొండలున్న గర్వాల్ రీజియన్‌లోని రుద్రప్రయాగ్, చమోలీ వంటి పలు ప్రదేశాల్లో ఆదివారం కార్చిచ్చు వ్యాపించినట్టు నివేదికలు వస్తున్నాయి. గతేడాది నవంబరు 1 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 918 కార్చిచ్చు ఘటనలు చోటుచేసుకున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. నవంబరు 1న చెలరేగిన కార్చిచ్చు కారణంగా 1,144 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి అగ్నికి ఆహుతయ్యింది. దాదాపు ఆరు నెలలుగా ఈ ఘటనలు కొనసాగుతున్నాయి. గడిచిన రెండు వారాలుగా అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజుల కిందట అల్మోరా జిల్లాలో పైన్ రెసిన్ అటవీ ప్రాంతంలో మంటల్లో చిక్కుకుని పూజ అనే 28 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. గతవారం ఆమె భర్తతో పాటు మరో ఇద్దరు చనిపోయారు.


కార్చిచ్చు పర్యాటకంపై కూడా ప్రభావం చూపుతోంది. కుమావన్ ప్రాంతంలో ట్రెక్కింగ్, పర్వతారోహణ యాత్రలపై సందేహాలు నెలకున్నాయి. అటువంటి పర్యటనలకు ప్లాన్ చేసుకున్న ఔత్సాహికులు ఇప్పుడు ముందుకు వెళ్లాలా? వద్దా? అనే సంధిగ్దంలో ఉన్నారు. ‘సాధారణంగా కుమావన్ ప్రాంతంలో ట్రెక్కింగ్ సీజన్ మే 10 తర్వాత ప్రారంభమవుతుంది.. అప్పటికి కార్చిచ్చు అదుపులోకి వస్తందని ఆశిస్తున్నాం. లేని పక్షంలో పర్యాటకుల కోసం ఒక అడ్వైజరీని జారీ చేయవలసి ఉంటుంది’ అని పితోర్‌గఢ్ జిల్లా పర్యాటక అధికారి కీర్తి ఆర్య అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com