మన ఫోన్‌లో కాంటాక్ట్స్‌లో లేని నంబర్ నుంచి కాల్ వస్తే.. ఎత్తాలా వద్దా అని వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం.. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. క్రెడిట్ కార్డు కావాలా? లోన్లు కావాలా? ఫ్లాట్ కావాలా? అంటూ ఇలా పదే పదే ఇబ్బందులు పెడుతుంటారు. వద్దనుకుంటుంటే అలాంటి కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. చాలా మందిని ఈ సమస్య వేధిస్తుంటుంది. రోజులో పదుల సంఖ్యలో ఇలాంటి కాల్స్ వస్తాయి. మనం అప్పుడు ఏదైనా పనిలో ఉన్నప్పుడు.. ఇలాంటి కాల్స్ వస్తే.. కోపం, చిరాకు వస్తాయి. ఇలాంటి కాల్స్‌ను నియంత్రించే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడట్లేదు. అందుకే ఇప్పుడు స్వయంగా కేంద్రం రంగంలోకి దిగింది. వీటికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. త్వరలోనే దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఇటువంటి కాల్స్ నియంత్రించేందుకు మార్గదర్శకాలు రూపొందించింది. రిజిస్టర్ కాని మొబైల్ నంబర్స్, అన్‌వాంటెడ్ కాల్స్ నియంత్రణ కోసం దీంట్లో పరిష్కారాల్ని ప్రతిపాదించింది. సాధారణంగా మనకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థల నుంచే ఎక్కువగా వస్తుంటాయి. వీటి నుంచి ప్రయోజనం పొందుతున్న కంపెనీలే ఈ స్పామ్ కాల్స్‌కు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ట్రాయ్ మార్గదర్శకాల్ని ఉల్లంఘిస్తే టెలికాం సంస్థలు భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది ట్రాయ్. ఇదే సమయంలో టెలికాం సంస్థలు.. కాల్స్ గుర్తించేందుకు వీలుగా వాటి ఐడెంటిటీ వెల్లడించాల్సి వస్తుంది. దీనికి 3 వేర్వేరు సిరీస్‌లను తీసుకురాబోతున్నారు.
మార్కెటింగ్ కాల్స్‌కు అయితే 140, సర్వీస్ కాల్స్ కోసం 160, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కమ్యూనికేషన్ కోసం అయితే 111 ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మీదట టెలికాం ఆపరేటర్స్.. ప్రతీ కాలర్ పేరు, సెక్టార్ సహా బహిర్గతం చేయాలి. దీనితో కస్టమర్లు వారికి వచ్చే ఫోన్ కాల్స్‌ను లిఫ్ట్ చేయాలా? వద్దా? అని నిర్ణయించుకుంటారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. టెలికాం సంస్థలతో గతవారం చర్చలు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలుస్తోంది.