పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. ఐటీ రిటర్నుల్లో లోపాలను ప్రస్తావిస్తూ మీరు ఎప్పుడైనా ఆదాయపు పన్ను నోటీసులు అందుకున్నారా? చాలా మంది నోటీసులు అందుకున్నప్పుడు ఆందోళన చెందుతారు. వెంటనే స్పందించాలనే హడావుడిలో ఇబ్బందుల్లో పడుతుంటారు. అయితే, అలాంటి వారందరూ ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. ఐటీ నోటీసులు అందుకున్నప్పుడు వాటికి స్పందించే ముందు డిపార్ట్‌మెంట్ నుంచి పంపిన నోటీసును మీరు ప్రామాణీకరించాలి. వచ్చిన నోటీసు అసలిదా, నకిలీదా? తెలుసుకోవడం ద్వారా ఇబ్బందులు తప్పించుకోవచ్చు.
ఆదాయపు పన్ను శాఖ పంపిన నోటీసు ప్రామాణికతను తనిఖీ చేసేందుకు ఒక మార్గం ఏంటంటే పంపిన ఇ-మెయిల్ ఐడీని క్రాస్ చెక్ చేయడం. intimations@cpc.incometax.gov.in వంటి incometax.gov.in తో ముగిసే దాని అధికారిక ID నుంచి పన్ను శాఖ అన్ని నోటీసులు, సమాచారాన్ని పంపిస్తుంది. అలాగే మరో ప్రత్యామ్నాయం మార్గం ద్వారానూ ఐటీ నోటీసుల ప్రామాణీకతను తెలుసుకోవచ్చు. ఐటీ శాఖ వెట్‌సైట్ సందర్శించడం ద్వారా నోటీసు వాస్తవికతను ప్రామాణీకరించవచ్చు. అందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్‌సైట్ లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఎడమ వైపున క్లిక్ లింక్స్‌లో ITD జారీ చేసిన నోటీసు అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.
స్టెప్ 1..
మీ వద్ద డాక్యుమెంట్ నంబర్ లేని సందర్భంలో మీరు పాన్ కార్డు నంబర్, నోటీసు టైప్, అసెస్మెంట్ ఇయర్, మొబైల్ నంబర్, నోటీసు ఇచ్చిన తేదీ ఎంటర్ చేయాలి. ఇది అసెస్మెంట్ ఇయర్ 2011- 12 నుంచి ఆ తర్వాత ఆర్థిక సంవత్సరాలకు మాత్రమే వర్తిస్తుంది. మీ వద్ద డాక్యుమెంట్ నంబర్ ఉంటే ఆ నంబర్ ఎంటర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
స్టెప్ 2..
రెండో దశలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు 6 అంకెల ఓటీపీ వస్తుంది.
స్టెప్ 3..
ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4..
ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం వద్ద ఎలాంటి రికార్డులు లేకుంటే అక్కడ మీకు నో రికార్డ్ ఫౌండ్ ఫర్ ది గివెన్ క్రైటీరియా అని కనిపిస్తుంది. ఏవైనా రికార్డులు ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్, నోటీసు వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.