దేశంలోని అదిపెద్ద వాణిజ్య సంస్థ అయిన టాటా గ్రూప్ వివిధ రంగాల్లో విస్తరించింది. ఈ టాటా గ్రూప్‌లో అత్యంత లాభదాయక కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టాటా గ్రూప్‌లో లాభదాయకమైన కంపెనీ ఏదంటే దాదాపు అందరి నోట టీసీఎస్ పేరు వస్తుంది. అయితే, ఇప్పుడు అలాంటి టీసీఎస్‌ను ఓవర్ టేక్ చేసింది మరో టాటా కంపెనీ. టీసీఎస్‌ను వెనక్కి నెట్టి టాటా గ్రూప్‌లో అత్యంత లాభదాయకమైన కంపెనీగా అవతరించింది. గత 10 ఏళ్లలో చూసుకుంటే ఇలా టీసీఎస్‌ను ఓవర్ టేక్ చేయడం ఇదే తొలిసారి.
టీసీఎస్‌ను ఓవర్ టేక్ చేసింది టాటా మోటార్స్. 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టాటా మోటార్స్ నికర లాభం రూ. 17,047 కోట్లుగా నమోదైంది. అయితే, 2024 క్యూ4 లో టీసీఎస్ లాభం రూ. 12,434 కోట్లకు పరిమితమైంది. దీంతో టీసీఎస్ కన్నా టాటా మోటార్స్ లాభం దాదాపు రూ. 5 వేల కోట్లు అధికంగా ఉందని చెప్పవచ్చు. టాటా మోటార్స్ లాభం ఏడాది క్రితం అంటే 2023 ఆర్థిక ఏడాది నాలుగో త్రైమాసికంలో రూ. 5,407.79 కోట్లుగా ఉండగా ఇప్పుడు అది ఏకంగా 221. 89 శాతం మేర పెరిగింది. మరోవైపు టీసీఎస్ నికర లాభం గతేడాది నాలుగో త్రైమాసికంలో రూ. 11,392 కోట్లు నమోదు కాగా ఇసారి కేవలం 9.1 శాతం వృద్ధి నమోదు చేసింది. దీంతో టాటా గ్రూప్ కంపెనీల్లో టీసీఎస్‌ను ఓవర్ టేక్ చేసి అత్యంత లాభదాయకమైన కంపెనీగా టాటా మోటార్స్ అవతరించింది.
టాటా మోటార్స్ చివరి సారిగా 2014లో తొలి త్రైమాసికంలో టాటా గ్రూప్ లో అత్యంత లాభదాయకమైన కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే టాటా మోటార్స్ కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో అధిక లాభాలతో టీసీఎస్‌ను అధిగమించినప్పటికీ వార్షిక ప్రాతిపదికన చూసుకుంటే టాటా గ్రూప్ కంపెనీల్లో అత్యంత లాభదాయకమైన కంపెనీగా టీసీఎస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ మొత్తం లాభం రూ. 45,908 కోట్లుగా ఉంది. అదే టాటా మోటార్స్ వార్షిక లాభం రూ. 31,399 కోట్లుగా ఉంది.