మీరు అమెజాన్ పే- ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కో బ్రాండ్ క్రెడిట్ కార్డు వాడే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. క్రెడిట్ కార్డు బెనిఫిట్స్‌లో కోత పెట్టింది. కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సాధారణంగా క్రెడిట్ కార్డుతో చేసే పలు రకాల లావాదేవీలపై క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు సహా డిస్కౌంట్లను కూడా ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తూ వస్తోంది. ఇన్ని రోజులుగా రెంట్ పేమెంట్లపై (అద్దె చెల్లింపులు) కూడా ఒక శాతం రివార్డు పాయింట్లు ఇస్తూ వచ్చింది. ఇక మీదట ఈ రివార్డ్ పాయింట్లు ఉండవని తెలిపింది బ్యాంకు. ఈ నిర్ణయం జూన్ 18 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే యూజర్లకు సందేశాలు కూడా పంపిస్తోంది.
ఈ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు విషయానికి వస్తే.. జాయినింగ్ ఫీజు సహా ఎలాంటి వార్షిక రుసుములు లేకుండానే ఐసీఐసీఐ బ్యాంకు- అమెజాన్ పే కో బ్రాండ్ క్రెడిట్ కార్డ్ జారీ చేస్తోంది. ప్రైమ్ వినియోగదారులకు.. ఈ కార్డుతో అమెజాన్ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ సహా ఇతర అదనపు డిస్కౌంట్లు కూడా ఇస్తోంది. ఫ్యూయెల్ సర్ ఛార్జీ చెల్లింపులపై ఒక శాతం రాయితీ ఇస్తోంది. ఇంకా ఈఎంఐ ట్రాన్సాక్షన్లు, బంగారం కొనుగోళ్లపై మాత్రం రివార్డు పాయింట్లు ఉండవు.
>> అంతకుముందు కూడా ఇతర బ్యాంకుల మాదిరిగానే ఐసీఐసీఐ బ్యాంకు.. సేవింగ్స్ ఖాతాలపై ఛార్జీల్ని సవరించింది. కొన్ని సేవింగ్స్ అకౌంట్లను నిలిపివేసింది. మినిమం బ్యాలెన్స్ విషయానికి వస్తే.. సేవింగ్స్ ఖాతా ప్రో మ్యాక్స్ దాంట్లో రూ. 50 వేలు కచ్చితంగా ఉండాలి. ప్రో ప్లస్‌లో రూ. 25 వేలు కనీసం మెయింటెయిన్ చేయాలి. లేకపోతే.. గరిష్టంగా రూ. 750 వరకు ఛార్జీ పడుతుంది. సేవింగ్స్ అకౌంట్ ప్రో లో కనీసం రూ. 10 వేలు ఉండాలి. ఇక్కడ కూడా గరిష్ట ఛార్జీ రూ. 750 గా ఉంది.
>> మరోవైపు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంకు వంటివి కీలక ప్రకటన చేశాయి. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కరెంట్, గ్యాస్, వాటర్ బిల్, ఇంటర్నెట్ బిల్ వంటి యుటిలిటీ బిల్స్ చెల్లించేవారు ఇకమీదట ఎక్కువ సర్ ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఇది మే 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఇదే సమయంలో ఇతర చాలా దిగ్గజ బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి.