వెరిటాస్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ కంపెనీ ఇవాళ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. NSE SME ఎక్స్చేంజీలో లిస్టయిన ఈ స్టాక్ అదిరిపోయే రిటర్న్స్ అందించడం విశేషం. ఇష్యూ ధర కేవలం రూ. 114 గానే ఉండగా.. ఏకంగా 141.22 శాతం ప్రీమియంతో రూ. 275 వద్ద లిస్టింగ్ అయింది. దీంతో లిస్టింగ్‌తోనే బంపర్ ప్రాఫిట్స్ ఇన్వెస్టర్లు అందుకున్నారు. ఇక ఆ తర్వాత కూడా ఏం తగ్గలేదు. మరోసారి అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది. 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో ఇంట్రాడేలో ఏకంగా రూ. 288.75 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో స్టాక్ కాస్త పతనమైంది. చివరకు ఒక్కరోజులోనే 129.17 శాతం లాభంతో రూ. 261.25 వద్ద స్థిరపడింది. ఒక్కో షేరుపై ఏకంగా రూ .147.25 లాభం వచ్చింది.
వెరిటాస్ అడ్వర్టైజింగ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కోసం మే 13న (సోమవారం) వచ్చింది. మే 15 వరకు ఇది కొనసాగింది. ధరల శ్రేణి రూ. 109 నుంచి రూ. 114 వరకు నిర్ణయించగా.. చివరకు ఇష్యూ ధరను రూ. 114 గా ఖరారు చేసింది. ఒక్కో షేరు ముఖ విలువ రూ. 10 గా ఉంది.
ఐపీఓ కింద ఒక్కో ఇన్వెస్టర్ కనీసం 1200 షేర్లను కొనుగోలు చేయాలి. ఈ లెక్కన రూ. 114 లెక్కన రూ. 136,800 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక బిడ్డింగ్ ఆఖరి రోజున ఏకంగా 621.62 రెట్ల సబ్‌స్క్రిప్షన్ జరిగింది. ఈ లెక్కన దీనికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
లిస్టింగ్‌తో రూ. 275 వద్ద చూసుకుంటే.. ఇక్కడ మీరు పెట్టిన రూ. 1,36,800 పెట్టుబడికి చేతికి రూ. 3,30,000 వచ్చాయి. ఇక్కడ లాభం చూసుకుంటే గనుక రూ.193,200 గా ఉంది. ఇక ఇంట్రాడే గరిష్టం వద్ద చూసుకుంటే షేరు ధర రూ. 288.75 కాగా.. ఇక్కడ మీ చేతికి మొత్తం రూ. 346,500 వచ్చేది. ఇక్కడ లాభం లెక్కగడితే.. రూ. 209,700 గా ఉంది. దీంతో రూ. 2 లక్షలకుపైగా లాభం అందుకున్నారు. సెషన్ ముగిసేసరికి చూస్తే లాభం రూ. 176,700 గా ఉంది. దీంతో ఎటు చూసినా ఈ ఐపీఓ లాభాల పంటే పండించింది.
ఈ ఐపీఓలో భాగంగా.. మార్కెట్ మేకర్స్‌కు 37,200 వరకు ఈక్విటీ షేర్లను కేటాయించగా.. నాన్- ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII) 1,06,800 ఈక్విటీ షేర్లు, రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లకు (RII) 2,48400 వరకు షేర్లు అలాట్ చేశారు. QIB ఇన్వెస్టర్ కేటగిరీ వారికి 1,74,000 షేర్లు కేటాయించారు. ఈ ఐపీఓ కేవలం రూ. 8.48 కోట్లు సమీకరించే లక్ష్యంతో రాగా.. ఇప్పుడు మార్కెట్ విలువ ఏకంగా రూ. 73 కోట్లకు చేరుకుంది. మొత్తం 7,44,000 షేర్లు ఇష్యూ కోసం వదిలింది.