ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీకి భారీ నష్టాలు వాటిల్లాయి. శనివారం రోజు ఈ కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం (జనవరి- మార్చి) ఫలితాల్ని వెల్లడించింది. మార్చి త్రైమాసికానికి గానూ మొత్తం 3 నెలల వ్యవధిలో ఈ కంపెనీ నికర నష్టం రూ. 397.66 కోట్లుగా ఉంది. ఇంధన వ్యయాలు పెరగడమే దీనికి కారణంగా పేర్కొంది. ఏడాది కిందట ఇదే సమయంలో చూస్తే కంపెనీ ఏకంగా రూ. 321.79 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ. 2193.85 కోట్లకు పెరిగింది. సరిగ్గా సంవత్సరం కిందట ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 1853.32 కోట్లుగా ఉండేది.
ఇంధన వ్యయాలు జనవరి మార్చి త్రైమాసికంలో రూ. 823.47 కోట్ల నుంచి ఏకంగా రూ. 953.67 కోట్లకు పెరగడమే ముఖ్యంగా కంపెనీకి నష్టాలు ఎదురయ్యేందుకు కారణం. ఇక 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూసుకుంటే కంపెనీ నికర నష్టం రూ. 470.77 కోట్ల నుంచి రూ. 2068.38 కోట్లకు పెరిగింది. ఇక విదేశీ కరెన్సీ మార్పిడి బాండ్లు (ఎఫ్ సీసీ బీ), క్యూఐపీ ద్వారా సెక్యూరిటీల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది. సెబీ నియమ నిబంధనలు, మార్గదర్శకాలు, చట్టాలకు లోబడి వీటి జారీ ఉండనుంది. ప్రస్తుతం రిలయన్స్ పవర్ 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆస్తుల్ని కలిగి ఉంది.
ఈ కంపెనీ షేరు విషయానికి వస్తే.. ప్రస్తుతం రూ. 26.65 వద్ద ఉంది. కిందటి రోజు 0.95 శాతం మేర పెరిగింది. గత కొంత కాలంగా పెద్దగా రాణించింది లేదు. 5 రోజుల వ్యవధిలో దాదాపు 3 శాతం పెరిగింది. నెల రోజుల్లో చూసుకుంటే 3 శాతానికిపైగా నష్టపోయింది. 6 నెలల్లో చూస్తే 28 శాతం పుంజుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 11.27 శాతం పెరిగింది. ఏడాదిలో చూస్తే 100 శాతానికిపైగా పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 10.70 వేల కోట్లుగా ఉంది.