అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు ఒక్కసారిగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ద్రవ్యోల్బణం తమ లక్షిత పరిధి అయిన 2 శాతం కంటే ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో.. వడ్డీ రేట్లను గరిష్ట స్థాయిలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది. అంటే అమెరికా ఎన్నికలు ముగిసేవరకు కూడా ఈ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచనున్నట్లు సంకేతాలు వచ్చాయి. ఫెడ్ నుంచి వచ్చిన ఈ సంకేతాలతో అమెరికా డాలర్ సహా బాండ్ ఈల్డ్స్‌వైపే ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం ఆకర్షణ కోల్పోయింది. ఇదే క్రమంలో పెట్టుబడిదారులు దీని నుంచి వెనక్కి వెళ్తున్నారు. ఈ ఒక్క కారణంతోనే ఇప్పుడు గోల్డ్ రేట్లు దిగొస్తుండటం విశేషం. వరుసగా 4 రోజులుగా రేటు పడుతూనే ఉంది. దీంతో పుత్తడి కొనాలనుకునే వారికి శుభవార్త అని చెప్పొచ్చు. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ ధరలు ఎక్కడ, ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు స్పాట్ బంగారం ధర ఔన్సుకు 2334 డాలర్ల వద్ద ఉంది. 5 రోజుల కిందట చూస్తే ఇది ఏకంగా 2450 డాలర్ల వద్ద గరిష్ట స్థాయిలో ఉండేది. తర్వాత ఒక్క ప్రకటనతోనే భారీగా పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు కూడా 34 డాలర్ల నుంచి దిగొచ్చి ఇప్పుడు 30 డాలర్ల లెవెల్స్‌లో ఉంది.
ఇక దేశీయంగా బంగారం, వెండి రేట్ల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో ఇప్పుడు తులం బంగారం ధర 22 క్యారెట్లపై రూ. 66,400 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు వరుసగా 3 రోజుల్లో రూ. 600, రూ. 1000, రూ. 900 చొప్పున పతనం అయ్యాయి. ఇంకా దిగొచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. ఇక 24 క్యారెట్స్ పసిడి రేటు 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 72,440 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధర స్థిరంగానే ఉంది. ఇక్కడ బంగారం ధర 10 గ్రాములు 22 క్యారెట్లపై రూ. 66,580 వద్ద ఉండగా.. మరోవైపు 24 క్యారెట్స్ పుత్తడి ధర తులం రూ. 72,590 వద్ద ఉంది.
బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి రేట్ల పతనం కొనసాగుతోంది. తాజాగా వెండి ధర రూ. 500 పడిపోయి కిలోకు రూ. 91,500 వద్ద ఉంది. అంతకుముందు కూడా వరుసగా రూ. 500, రూ. 3300 చొప్పున పతనమైంది. ఇక హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే ఇక్కడ కూడా రూ. 500 తగ్గి ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ. 96 వేల మార్కు వద్ద ఉంది.