క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్. ఈ జూన్ 1వ తేదీ నుంచి 5 బ్యాంకులు క్రెడిట్ కార్డు నిబంధనలను మార్చాయి. రివార్డ్ ప్రోగ్రామ్, ఫీ విధానంలో మార్పులు చేశాయి. ఈ మార్పులు వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. క్రెడిట్ కార్డు నిబంధనలు మార్చిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. మరి ఏ బ్యాంకు ఎలాంటి నిబంధనలు తీసుకొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్‌బీఐ కార్డు: జూన్, 2024 నుంచి ఎస్‌బీఐ కార్డు కీలక మార్పులు చేసింది. ఇకపై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ట్రాన్సాక్షన్లు చేసినట్లయితే రివార్డు పాయింట్లు ఇవ్వదు. ఈ జాబితాలో ఆరమ్, ఎస్‌బీఐ కార్డు ఎలైట్, ఎస్‌బీఐ కార్డు ఎలైట్ అడ్వాంటేజ్ వంటివి ఉన్నాయి.
అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు: ఈ కార్డు వినియోగదారులకు కొత్త రూల్స్ జూన్ 18వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ కార్డుల ద్వారా రెంట్ పేమెంట్లు చేస్తే ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఉండవు. అయితే, ఫ్యూయల్ సర్‌ఛార్జీ పేమెంట్లపై 1 శాతం డిస్కౌంట్ అనేది కొనసాగనుంది. అలాగే బంగారం కొనుగోళ్లు, ఈఎంఐలపై ఎలాంటి రివార్డు పాయింట్లు రావు.
స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు: జూన్ 21వ తేదీ నుంచి స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు క్యాష్ బ్యాక్ విధానంలో మార్పులు రానున్నాయి. క్యాష్ బ్యాక్ అనేది ఇకపై స్విగ్గీ మనీ రూపంలో స్విగ్గీ యాప్‌లో కనిపించడానికి బదులుగా కార్డు స్టేట్మెంట్ బ్యాలెన్స్‌లో కనిపిస్తుంది. ఈ మార్పులతో రిడంప్షన్ ప్రాసెస్ సులభమవుతుంది. కార్డు హోల్డర్లకు తదుపరి నెల బిల్లు తగ్గుతుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు: జూన్ 23వ తేదీ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా తమ వన్ కో బ్రాండెట్ క్రెడిట్ కార్డుపై కొత్త ఛార్జీలు విధిస్తోంది. బకాయిలపై వడ్డీ రేట్లు, ఓవర్ లిమిట్ ఫీస్, లేట్ పేమెంట్స్ ఛార్జీల వంటి వాటిలో మార్పులు చేసింది.