భారత్‌లో ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను సవరించింది. ఈ మేరకు బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఇక ఈ కొత్త వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే (జూన్ 7, 2024) అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ఈ బ్యాంకులో ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ నుంచి గరిష్టంగా మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేట్లు 8.95 శాతం నుంచి 9.35 శాతం వరకు ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొన్ని టెన్యూర్లపై ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించడం కూడా విశేషం. రెండేళ్ల టెన్యూర్ MCLR ను 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించగా.. అంతకుముందు 9.35 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది 9.30 శాతానికి చేరింది. అయితే మిగతావన్నీ యథాతథంగానే ఉన్నాయి.
వడ్డీ రేట్లను సవరించిన తర్వాత ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 8.95 శాతంగా ఉంది. ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 9 శాతంగా కొనసాగుతోంది. 3 నెలల ఎంసీఎల్ఆర్ 9.15 శాతంగా ఉంది. ఇక ఈ బ్యాంకులో 6 నెలల రుణ రేట్లు 9.30 శాతంగా ఉంది. ఏడాది ఎంసీఎల్ఆర్, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 9.30 శాతంగా ఉండగా.. మూడేళ్ల వ్యవధి ఎంసీఎల్ఆర్ 9.35 శాతంగా ఉంది. ఎంసీఎల్ఆర్ అనేది ఏ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ అయినా లోన్లపై వసూలు చేసే కనీస వడ్డీ రేటు అన్నమాట. ఇంతకంటే తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చేందుకు వీల్లేదు. అన్నింటికీ ఒకే విధానం ఉండాలన్న ఉద్దేశంతో ఆర్బీఐ ఈ విధానం తీసుకొచ్చింది. దాదాపు అన్ని బ్యాంకుల్లో ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ కస్టమర్ల లోన్లకు అనుసంధానమై ఉంటుంది. ఎంసీఎల్ఆర్ పెరిగితే వడ్డీ రేట్లు పెరుగుతుంటాయి. ఈఎంఐ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అదే ఎంసీఎల్ఆర్ తగ్గితే.. లోన్ వడ్డీ రేట్లు తగ్గుతాయి. అప్పుడు లోన్లపై తక్కువ ఈఎంఐ పడుతుంది.
ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇతర వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు 17.95 శాతంగా ఉంది. ఇది 2024 మార్చి 11 నుంచి అమలవుతోంది. ఇక బేస్ రేటు 9.45 శాతంగా ఉండగా.. ఇది 2024, మార్చి 11 నుంచే అమల్లో ఉంది. సాధారణంగా ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తే.. బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తుంటాయి. కానీ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వరుసగా 8వ సారి సమీక్షలో కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచింది. ప్రస్తుతం రెపో రేటు 6.50 శాతం వద్దే ఉంది. అయినప్పటికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రెండేళ్ల ఎంసీఎల్ఆర్ తగ్గించడం విశేషం.