సెల్ఫీల పిచ్చితో ప్రమాదాలను కోరి కొనితెచ్చుకోవద్దని చెబుతున్నా యువత మాత్రం పట్టించుకోవడం లేదు. సెల్ఫీ మోజుతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నా... సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్ల కోసం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చాలా మంది బలవుతున్నారు. తాజాగా, ఓ చారిత్రక రైలుతో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది. అత్యంత విషాదకర ఈ ఘటన మెక్సికోలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.
మెక్సికోలోని హిడాల్గో సమీపంలో ఆవిరి ఇంజిన్‌తో నడిచే ‘ఎంప్రస్’ అనే పురాతన రైలును చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. పట్టాల వద్ద యువత గుమిగూడి.. రైలు సమీపిస్తుండడంతో ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని భావించారు. ఈ క్రమంలో ఓ యువతి పట్టాలకు మరింత చేరువుగా వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. కానీ, అంతలో వేగంగా దూసుకొచ్చిన ఢీకొట్టడంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వైరల్ అవుతోన్న క్లిప్‌లో ఓ చిన్నారికి దగ్గరగా నిలబడి ఓ మహిళ ఫోటో తీయడానికి సిద్ధమవుతుండగా.. ఇంతలో రైలు సమీపించడంతో ఆమె కిందపడిపోయింది. ఇంజిన్ ఆమె తలను ఢీకొట్టి దూసుకుపోయింది. సమీపంలోని వ్యక్తి ఆమెను పట్టుకుని లాగేందుకు ప్రయత్నించినా.. అప్పటికే ఘోరం జరిగిపోయింది. దీంతో షాక్ అయిన చిన్నారి భయంతో పరుగులు తీశాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కెనడియన్ పసిఫిక్ కాన్సాస్ సిటీ (CPKC) విభాగం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేసింది. రైలు వచ్చే సమయంలో పట్టాలకు కనీసం 10 మీటర్ల దూరంలో ఉండాలని.. అక్కడ నిలబడకూడదంటూ ఓ ప్రకటనలో సూచించింది. ప్రమాదంలో చనిపోయిన మహిళ.. తన కుమారుడితో కలిసి అక్కడకు వెళ్లినట్టు పేర్కొంది.
‘ఎంప్రస్’ఆవిరి ఇంజిన్ రైలు 1930లో ప్రారంభం కాగా.. దీని అధికారిక పేరు కెనడియన్ పసిఫిక్ 2816. ఈ రైలు సేవలకు ఇకపై ముగింపు పలకనున్నారు. దీంతో చివరిసారి స్నేహపూర్వక పర్యటనలో భాగంగా కెనడా, అమెరికా, మెక్సికోల మీదుగా ప్రయాణిస్తోంది. ఏప్రిల్‌లో కాల్గరీ నుంచి మొదలైన ఈ రైలు ప్రయాణం శుక్రవారం మెక్సికో సిటీలో ముగుస్తుంది. అనంతరం కెనడాకు జులైలో చేరుకుని, శాశ్వతంగా సేవల నుంచి వైదొలుగుతంది.