డేటింగ్ యాప్స్. యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామిని ఎన్నుకునేందుకు ఇవి ఒక మోడ్రన్ ట్రెండ్. ఈ యాప్స్‌లలో తమ ఇష్టాలకు దగ్గరగా ఉన్న వారిని కలిసి ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం లేదంటే నచ్చినంత కాలం కలిసి ఉండి.. ఆ తర్వాత విడిపోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి డేటింగ్ యాప్స్ వల్ల యువతీ యువకులు చెడిపోతున్నారని కొన్ని ప్రభుత్వాలు ఈ డేటింగ్ యాప్స్‌పై నిషేధం విధిస్తూ ఉంటాయి. కానీ జపాన్ ప్రభుత్వం మాత్రం ఏకంగా డేటింగ్ యాప్స్‌నే తీసుకువచ్చింది. అమ్మాయిని చూసిపెడతాం.. పెళ్లి చేసుకోండిరా బాబూ అంటూ యువత వెంట పడుతున్నాయి.
అయితే జపాన్‌లో జనాభా తగ్గిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటం.. యువత సంఖ్య తగ్గిపోతుండటంతో భవిష్యత్‌లో తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడనున్నాయని గుర్తించిన జపాన్ ప్రభుత్వం.. చర్యలు చేపట్టింది. అక్కడి యువత పెళ్లిళ్లు చేసుకోకపోవడం, చేసుకున్నా పిల్లల్ని కనకపోవడంతో ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. దీంతో జపాన్ ప్రభుత్వం సొంతంగా డేటింగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. "సింగిల్స్ మీ కోసమే.. మేం పిల్లను వెతికి పెడతాం.. మీరు పెళ్లి చేసుకోండి.. మీకు కావాల్సిన అమ్మాయి, అబ్బాయిలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని డేటింగ్ యాప్‌లో పట్టుకోండి" అంటూ ప్రచారం చేస్తోంది.
అయితే ప్రభుత్వమే స్వయంగా డేటింగ్ యాప్‌ను ప్రారంభించి.. ప్రచారం చేయటం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టోక్యో ఫుటారి స్టోరీ పేరుతో డేటింగ్ యాప్‌ను జపాన్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ యాప్ కేవలం పెళ్లికి సిద్దమైన వారికి మాత్రమేనని వెల్లడించింది. జపాన్‌లో 50 ఏళ్ల వయసున్న పురుషుల్లో సుమారు 30 శాతం మంది పెళ్లి కాకుండా బ్రహ్మచారులుగా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. తగ్గుతున్న జననాల రేటును పెంచటం కోసమే ప్రభుత్వం ఈ యాప్‌ను లాంచ్ చేసిందని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం జపాన్‌లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే 6 ఏళ్లలో అక్కడ యువ జనాభా భారీగా పడిపోతుందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో యువ జనాభాను కాపాడుకోవటానికి ఇదే చివరి అవకాశంగా భావిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ యాప్‌ను ప్రమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే 300 యెన్‌లు భారత కరెన్సీలో ఏకంగా రూ.16 కోట్ల నిధులను కేటాయించింది.