బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి కేంద్ర బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. దీని నిర్వచనాన్ని సవరించాలని నిర్ణయించింది. రూ. 3 కోట్లు లేదా ఆపైన చేసే మొత్తాన్ని ఈ పరిధిలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని ప్రస్తుతానికి జారీ చేయలేదు. త్వరలోనే విధివిధానాలు రూపొందించి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ప్రస్తుతం రూ. 2 కోట్లు లేదా ఆపైన డిపాజిట్ చేస్తే దానిని బల్క్ డిపాజిట్ అని పేర్కొంటుంది. అయితే ఇప్పుడు రూ. 3 కోట్ల వరకు కూడా రిటైల్ డిపాజిట్‌గానే ఉండనుంది.
ఇప్పుడు రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు కూడా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌గానే పేర్కొంటారు. సాధారణంగా బ్యాంకులు ఏవైనా.. రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంటాయి. దీంతో ఈ నిర్ణయం ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి గుడ్‌న్యూస్ అని చెప్పొచ్చు. గతంతో పోల్చితే రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు చేసే ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. కొన్ని బ్యాంకులు ఇంకా కాల పరిమితిని బట్టి బల్క్ డిపాజిట్లపైనా ఆకర్షణీయ స్థాయిలో వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. కొత్త మార్పు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు వర్తిస్తాయి. ఇంకోవైపు రీజనల్ రూరల్ బ్యాంకుల విషయంలో మాత్రం రిటైల్ డిపాజిట్ పరిమితిని రూ. కోటికి పెంచింది ఆర్బీఐ. ఆర్ఆర్‌బీల్లో రూ. కోటి.. ఆపై మొత్తాన్ని బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా పరిగణిస్తారు. రెండు రోజుల ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల్ని రిజర్వ్ బ్యాంక్.. ఇవాళ వెల్లడించింది. వరుసగా 8వ సారి కీలక రెపో రేట్లు యథాతథంగానే ఉంచుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రెపో రేటు 6.50 శాతం వద్ద ఉంది.