జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ముష్కరులు ఉగ్ర ఘాతుకానికి పాల్పడ్డారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బుస్సపై విచక్షణారహితంగా కాల్పులతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో.. ఓ బుల్లెట్.. ఆ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు తగిలింది. దీంతో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. అది కాస్త అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుర్ఘటనలో మరో 33 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు, భద్రతా బలగాలు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని కాటఢాలో ఉన్న శివకోరి గుహలో ఉన్న ఓ దేవాలయానికి వెళ్తుండగా.. రియాసి జిల్లాలో ఈ ఘోర ఉగ్ర సంఘటన జరిగింది.
ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు.. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదుల ఆనవాళ్ల కోసం ముమ్మరంగా వెతుకుతున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన రియాసీ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు తక్కువే ఉంటాయని పోలీసులు తెలిపారు. రియాసీ జిల్లా పక్కనే ఉన్న రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో తరచూ ఇలాంటి ఉగ్రదాడులు జరుగుతాయని.. అయితే ఇప్పుడు అక్కడ కూడా జరగడంతో భద్రతా బలగాలు మరింత అలర్ట్ అయ్యాయి.