ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 25 ఏళ్లుగా అప్రహతిహతంగా ఒడిశాను పాలిస్తున్న నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా దళ్ - బీజేడీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు తగ్గిపోగా.. లోక్‌సభ ఎన్నికల్లో అయితే బీజేడీ కనీసం ఖాతా కూడా తెరవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే బీజేడీ పార్టీ ఓటమికి నవీన్ పట్నాయక్ అత్యంత సన్నిహితుడు, ఆయన వారసుడిగా చెప్పబడుతున్న వీకే పాండియన్ అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ మేరకు ఆదివారం ఒక వీడియోను విడుదల చేసిన వీకే పాండియన్.. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తన ఈ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే క్షమించండి అని పేర్కొన్నారు. తనపై జరిగిన ప్రచారం వల్లే బీజేడీ పార్టీ ఒడిశా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైతే తనను క్షమించమని వేడుకున్నారు. తాను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చానని.. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయడం అనేది తనకు చిన్నతనం నుంచి కల అని చెప్పారు.
పూరీ జగన్నాథుని ఆశీస్సులతో తాను ఐఏఎస్ సాధించగలిగానని.. తన కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే తాను ఒడిశాకు వచ్చానని.. తాను ఒడిశాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ప్రజల కోసం కష్టపడి పనిచేసినట్లు వీడియోలో పేర్కొన్న వీకే పాండియన్.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఒడిశాలో నవీన్ పట్నాయక్‌కు చెందిన బిజూ జనతా దళ్ పార్టీకి దారుణ ఓటమి ఎదురైంది. 25 ఏళ్లుగా ఒడిశాను ఏలుతున్న బీజేడీ పార్టీ.. ఈ ఎన్నికల్లో చతికిలపడింది. 147 స్థానాలు ఉన్న ఒడిశా అసెంబ్లీలో బీజేపీ 78 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకుంది. బీజేడీ 51, కాంగ్రెస్ 14 సీట్లలో విజయం సాధించాయి. అయితే లోక్‌సభ ఎన్నికలలో మొత్తం 21 ఎంపీ స్థానాలు ఉండగా.. బీజేపీ 20, కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపొందగా.. బీజేడీ కనీసం ఖాతా తెరవలేదు. ఇక ఈ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ తర్వాత వీకే పాండియన్ పేరు ప్రముఖంగా వినిపించింది. మాజీ ఐఏఎస్, తమిళనాడుకు చెందిన వ్యక్తి అయిన వీకే పాండియన్.. బీజేడీ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయితే నవీన్ పట్నాయక్ ఇలా అధికారుల చేతిలోకి వెళ్లారని బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.