దిగ్గజ ఎలక్ట్రానిక్ చిప్ మేకర్ ఎన్విడియా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. బడా టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ను దాటేసి ఈ స్థానానికి చేరింది. కృత్రిమ మేధకు (ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్) ఆదరణ పెరుగుతున్న క్రమంలో ఎన్విడియా షేర్లకు డిమాండ్ కూడా అదే రీతిలో పెరిగిపోతోంది. ఏఐ, అటానమస్ వెహికిల్స్, రోబోటిక్స్ సహా అత్యాధునిక సాంకేతికతలో వాడే పలు రకాల చిప్స్‌ను అందిస్తోంది ఎన్విడియా. ఈ నేపథ్యంలోనే కంపెనీ వృద్ధిపై బలమైన విశ్వాసంతో ఉన్న మదుపరులు ఈ షేర్ల కోసం పోటీపడుతున్నారు.
మంగళవారం సెషన్‌లో అమెరికా మార్కెట్లు ముగిసే సమయానికి ఈ స్టాక్ ధర 3 శాతం మేర పుంజుకొని 135.58 డాలర్ల దగ్గర స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 110 బిలియన్ డాలర్లు పెరిగి 3.335 ట్రిలియన్ డాలర్లకు చేరిందని చెప్పొచ్చు. ఎన్విడియా సంస్థ ఇటీవల దిగ్గజ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్‌ను అధిగమించి రెండో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. కొద్ది రోజుల వ్యవధిలోనే అక్కడి నుంచి మొదటి స్థానానికి ఎగబాకడం విశేషం. మైక్రోసాఫ్ట్ విలువ ఇప్పుడు 3.317 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా.. యాపిల్ ఎం- క్యాప్ 3.286 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
ఇక ప్రపంచం మొత్తం మీద విలువైన కంపెనీల లిస్టులో ఇవి వరుసగా ఇప్పుడు 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఎన్విడియా స్టాక్ ధర ఈ సంవత్సరంలోనే ఇప్పటివరకు 3 రెట్లు పెరగడం విశేషం. మరోవైపు ఈ సమయంలో మైక్రోసాఫ్ట్ షేరు ధర 19 శాతం పెరిగింది.
1999లో ఐపీఓగా వచ్చిన ఎన్విడియా..
ఎన్విడియా 1999 సంవత్సరంలో ఐపీఓకు వచ్చింది. అప్పట్లో ఒక్కో షేరు ధర 12 డాలర్లుగా నిర్ణయించింది. తర్వాతి కాలలో గేమింగ్ నుంచి మొదలుకొని కొత్త తరం టెక్నాలజీల కోసం చిప్స్ గిరాకీ పుంజుకోవడంతో కంపెనీ షేర్ల విలువ పెద్ద మొత్తంలో పెరిగిపోయింది. భారతీయులు ఎవరైనా అప్పుడు ఈ కంపెనీ ఐపీఓలో రూ. 10 వేలు ఇన్వెస్ట్ చేసి షేర్లు పొంది ఉంటే.. (అప్పటి డాలర్ విలువను బట్టి చూస్తే) 19 షేర్లు వచ్చేవి.
ఇక క్రమంగా స్టాక్ విలువ భారీగా పెరిగిన క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉండేలా ఎన్నో సార్లు షేర్లను కంపెనీ విభజించింది. దీంతో 2000 సంవత్సరానికి ముందున్న ఎన్విడియా షేరు ఇప్పుడు 480 షేర్లకు సమానమైంది. దీంతో రూ. 10 వేలతో సొంతం చేసుకున్న19 షేర్ల సంఖ్య ఇప్పుడు 9,120 కి చేరింది.
ఎన్విడియా స్టాక్ ధర..
ప్రస్తుతం ఎన్విడియా స్టాక్ ధర 135 డాలర్ల లెక్కన మొత్తం 9120 షేర్ల విలువ 1.231 మిలియన్ డాలర్లకు చేరి ఉంటుంది. ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం చూస్తే ఇది రూ. 10.27 కోట్లకు చేరింది. అంటే 25 సంవత్సరాల కిందట ఈ కంపెనీ షేర్లలో రూ. 10 వేలు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు.
ఎన్విడియా స్టాక్ ధర పెరగడంతో.. కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్.. ఫోర్బ్స్ రియల్‌టైం బిలియనీర్ల లిస్టులో 11వ స్థానానికి చేరారు. మంగళవారం రోజు ఆయన సంపద 4 బిలియన్ డాలర్లు (రూ. 33.4 వేల కోట్లు) పెరిగి 119 బిలియన్ డాలర్లకు చేరింది. 2019లో ఈయన ప్రపంచ ధనవంతుల జాబితాలో 546 వ స్థానంలో ఉండగా.. ఐదేళ్లలో ఆయన సంపద 2250 శాతం మేర పెరిగింది.