ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మధ్య పోరుతో పాటు మరో పోటీ అత్యంత ఆసక్తిని రేకెత్తించింది. అదే కడప లోక్ సభ నియోజకవర్గంలో అక్కా తమ్ముళ్ల మధ్య జరిగిన ఎన్నికల సమరం. కడప లోక్ సభ స్థానానికి వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీచేయగా.. ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగారు. దీంతో ఈ నియోజకవర్గంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే చివరకు విజయం మాత్రం అవినాష్ రెడ్డినే వరించింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇక్కడ మూడోస్థానానికి పడిపోయారు. ఇక ఆ ఓటమిపై తాజాగా స్పందించారు వైఎస్ షర్మిల. బుధవారం విలేకర్ల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడిన షర్మిల.. తన ఓటమిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికి, అలాగే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను వెల్లడించారు.
కడపలో తాను ఓడిపోవటానికి ప్రధానంగా ఎన్నికల ప్రచారానికి సమయం లేకపోవటమే కారణమని వైఎస్ షర్మిల విశ్లేషించారు. ఎన్నికల సమయంలో తాను 14 రోజులు మాత్రమే కడపలో ప్రచారం చేయగలిగానని.. మిగిలిన సమయం రాష్ట్రవ్యాప్త ప్రచారానికే సరిపోయిందన్నారు. అలాగే వైఎస్ఆర్ బిడ్డ పోటీచేస్తోందన్న విషయం గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి తెలియనేలేదని.. తన ఓటమికి ఇదే కారణమని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీ ఓటర్లు కూడా ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే ఒకేవైపు ఓటేశారని షర్మిల చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకూడదనే ఉద్దేశంతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకీ ఓటు వేయలేదనే అభిప్రాయాన్ని షర్మిల వ్యక్తం చేశారు.
" ఓటు వృధా కాకూడదు. ప్రభుత్వం ఎలాగైనా మారాలి, మేము మార్చాలని అని ప్రజలు అనుకున్నారు. అదే బలంగా నిర్ణయించుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేసేందుకు ప్రజలు ఆలోచించారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో చోటు సంపాందించుకోవటం మొదలుపెట్టింది. ఇది ఇలాగే అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో మేమంతా కష్టపడి పనిచేస్తాం. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. 2029కల్లా మంచి స్థానానికి వస్తామనే నమ్మకం ఉంది." అని వైఎస్ షర్మిల అన్నారు.
"చంద్రబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆయనకు మరోసారి గుర్తు చేస్తున్నా. మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలి. అది ఆంధ్రప్రదేశ్ ఊపిరి. పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో ఏపీని మోసం చేస్తున్నారు. పదేళ్లు గడిచినా బీజేపీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ప్రస్తుతం చంద్రబాబు మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం నిలబడింది. చంద్రబాబు మద్దతు ప్రకటించకపోతే బీజేపీ అధికారంలో ఉండేది కాదు. ఏపీ ప్రజల కారణంగానే కేంద్రంలో మోదీ సర్కారు నిలబడింది. ఇప్పటికైనా చంద్రబాబు.. ప్రత్యేక హోదాను డిమాండ్ చేయాలి" అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.