ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. 14 పంటలకు మద్దతు ధర పెంపు.. క్వింటాల్ వరికి రూ.2300

national |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 10:16 PM

మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. తాజాగా రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర పెంచుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. వరి, రాగులు, మినుము, జొన్న, మొక్కజొన్న, పత్తి సహా 14 పంటలకు ఎంఎస్‌పీ కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదం వెల్లడించిందని తెలిపారు.


దేశంలోని అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వరి పంటకు కొత్త మద్దతు ధర రూ.2,300 కు చేరుకుందని తెలిపారు. ఇది గతంలో ఉన్న ఎంఎస్‌పీ కంటే రూ.117 ఎక్కువ అని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు దాదాపు రూ.2 లక్షల కోట్లు అందుతాయని చెప్పారు. ఇది గత సీజన్‌తో పోల్తిస్తే రూ.35 వేల కోట్ల కంటే ఎక్కువ అని వివరించారు.


 పంట పండించే ఖర్చు కంటే కనీస మద్దతు ధర ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉండాలని.. 2018 కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా మోదీ సర్కార్.. ఒక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయం.. దానికి అనుగుణంగా ఉందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వరి ఎంఎస్‌పీని 5.35 శాతం అంటే రూ. 117 పెంచి క్వింటాల్‌కు రూ. 2,300 చేసినట్లు తెలిపారు. ఇదే వరికి మద్దతు ధర 2013-2014 లో చూస్తే కేవలం రూ. 1,310 మాత్రమేనని చెప్పారు. ఇక పత్తి కనీస మద్దతు ధర సాధారణ రకానికి రూ.7,121 అని.. నాణ్యత గల మరో రకం పత్తికి రూ.7,521 కి పెంచినట్లు వెల్లడించారు. ఇది గత ఎంఎస్పీ కంటే రూ.510 ఎక్కువ అని వెల్లడించారు.


ఇక తృణధాన్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కువ దృష్టి సారించారని.. అందులో జొన్నకు ఎంఎస్పీ రూ. 3,371.. రాగులకు రూ. 4,290.. మొక్కజొన్నకు రూ. 2,225 గా నిర్ణయించినట్లు చెప్పారు. మరోవైపు.. పప్పుల విషయానికి వస్తే.. పెసర్లకు రూ.8,682 గా నిర్ణయించారు. కందులకు రూ. 7,550.. మినుములకు రూ.7,400 గా ఎంఎస్పీగా నిర్ణయించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఇక పొద్దుతిరుగుడు, వేరుశెనగ వంటి నూనె గింజల ఎంఎస్‌పీ కూడా పెంచినట్లు తెలిపారు.


ఇక కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఇతర నిర్ణయాలను కూడా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 2 లక్షల గోడౌన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. దీంతో పాటు మహాపాల్‌ఘర్-బధావన్ పోర్ట్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. మహారాష్ట్రలో వధవన్ పోర్టు ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.76,200 కోట్లతో నిర్మించనున్న ఈ వధవన్ పోర్టు పూర్తి అయితే ప్రపంచంలోని టాప్ 10 పోర్టుల్లో ఒకటిగా ఇది నిలవనుంది. ఇక రూ.7,453 కోట్లతో గుజరాత్, తమిళనాడులో గిగావాట్‌ ఆఫ్‌షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్త టెర్మినల్, రన్‌వే పొడిగింపుతో సహా వారణాసి ఎయిర్‌పోర్టు అభివృద్ధికి రూ.2,869.65 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం కల్పించింది. కాశీ ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్ భవనం, కొత్త రన్‌వే, అండర్‌పాస్ హైవే నిర్మాణానికి సైతం కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com