ప్రస్తుత రోజుల్లో అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య సంతానలేమి. వాస్తవానికి ఇది మహిళల సమస్యగా అందరూ భావిస్తారు. కానీ పురుషుల్లో లోపాలు కూడా చాలా ఉంటాయి.కృత్రిమ గర్భధారణకు వెళుతున్నవారిలో 30 శాతం పురుషులే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతోందని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని పరిశోధనలు కూడా ఈ విషయాన్ని నిరూపించాయి. మారుతున్న జీవనశైలితోపాటు పర్యావరణ అంశాలు కూడా పురుషుల్లో సంతానలేమికి దోహదం చేస్తున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంద్వారా సంతాన సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
బరువు ఎక్కువగా ఉంటే వీర్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శుక్ర కణాల సంఖ్య తగ్గడంతోపాటు ఇవి చురుగ్గా ఉండవు. అంతేకాకుండా వీర్యకణాల ఆకారం కూడా సరిగా ఉండదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులు, గింజ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. మిఠాయిలు, తీపి పానీయాలు, మాంసం తగ్గించుకుంటే వీర్యంలో నాణ్యత పెరుగుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. కృత్రిమ టెస్టోస్టిరాన్ తీసుకోకూడదు. దీనివల్ల వృషణాల సైజు తగ్గడంతోపాటు వీర్యం ఉత్పత్తి తగ్గుతుంది. లేదంటూ పూర్తిగా ఆగిపోవచ్చు. స్టెరాయిడ్స్ ఆపేసినవారికి ఏడాదిలోగా వీర్యం తిరిగి ఉత్పత్తి అవుతోంది
కొకైన్, హెరాయిన్, గంజాయిలాంటివి పునరుత్పత్తి అవయవాల పనితీరును దారుణంగా దెబ్బతీస్తాయి. వీర్యం ఉత్పత్తి తగ్గడంతోపాటు నాణ్యత మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇవి తీసుకునేవారిలో వృషణాల క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. చుట్టలు, బీడీలు, సిగరెట్లతోపాటు ఈసిగరెట్లు కూడా కాలుస్తున్నారు. వీటివల్ల సంతాన సామర్థ్యం తగ్గుతుంది. వీర్యకణాలు గర్భాశయం వరకు చేరుకోవు. కొందరిలో స్తంభన లోపం తలెత్తుతోంది. వీర్యం డీఎన్ఏ దెబ్బతింటే పిల్లలు పుట్టరు. ఒకవేళ పుట్టినా జన్యుమార్పులు వారికి కూడా సంక్రమిస్తాయి. పొగతాగడం మానేసిన ఏడాదిలోగా తిరిగి సంతాన సామర్థ్యం మెరుగవుతున్నట్లు పరిశోధనలు నిరూపించాయి. ప్లాస్టిక్ సీసాల్లో మంచినీరు తాగకుండా ఉండటమే ఉత్తమం. పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి తినాలి.