కేంద్రం అందిస్తున్న స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పీపీఎఫ్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో అత్యధిక వడ్డీ రేటు ఉన్నప్పటికీ.. పీపీఎఫ్‌లోనూ చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. ఇది రిటైర్మెంట్ ఫండ్‌గా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. చిన్న మొత్తాల్లో డబ్బులు డిపాజిట్ చేస్తూ పోతే లాంగ్ రన్‌లో భారీగా ఆర్జించొచ్చు.
పీపీఎఫ్ పథకంలో ప్రస్తుతం వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీ రేట్లను కేంద్రం సవరిస్తుంటుంది. జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి ఇటీవల వడ్డీ రేట్లను ప్రకటించగా యథాతథంగానే ఉంచింది. ఇక ఈ పథకంలో పెద్దలు లేదా పిల్లల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. బ్యాంక్ లేదా పోస్టాఫీసుల్లో ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 500 పెట్టుబడితో అకౌంట్ తెరవొచ్చు. గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. వరుసగా 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. తర్వాత అవసరాన్ని బట్టి ఐదేళ్ల చొప్పున అకౌంట్ పొడిగించుకోవచ్చు.
పీపీఎఫ్ పథకంలో అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే.. పెట్టుబడిపై, వడ్డీ రాబడిపై, మెచ్యూరిటీ ఆదాయంపై టాక్స్ ఉండదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద పాత పన్ను విధానంలో ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయించుకోవచ్చు.
పీపీఎఫ్ కాలిక్యులేటర్..
పెట్టుబడి మొత్తాన్ని బట్టి రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. ఎవరి ఆదాయానికి తగ్గట్లుగా వారు పెట్టుబడి పెట్టొచ్చు. ఏడాదికి ఒకసారి లేదా ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో డబ్బులు కట్టొచ్చు. ఉదాహరణకు ఇప్పుడు నెలకు రూ. 5 వేల చొప్పున ఏడాదికి రూ. 60 వేలు పెట్టుబడి పెట్టారనుకుందాం. మొత్తం 15 సంవత్సరాలకుగానూ రూ. 9 లక్షలు పెట్టుబడి అయితే వడ్డీతో కలిపి చేతికి రూ. 16.27 లక్షలొస్తాయి. ఇక్కడ మరో ఐదేళ్లు అకౌంట్ పొడిగిస్తే రూ. 12 లక్షల పెట్టుబడితో రూ. 26 లక్షలు చేతికి అందుతాయి.
ఇక నెలకు రూ. 10 వేల చొప్పున సంవత్సరానికి రూ. 1.20 లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ రూ. 24 లక్షలపై చేతికి 15 ఏళ్లలో పెట్టుబడి రూ. 18 లక్షలపై చేతికి మొత్తం రూ. 32.54 లక్షలు వస్తాయి. 20 ఏళ్లలో ఇది రూ. 53.26 లక్షలు అవుతుంది. గరిష్ట పెట్టుబడి అయిన ఏడాదికి రూ. 1.50 లక్షలపై 15 ఏళ్లకు రూ. 40,68,209 వస్తుంది. 20 సంవత్సరాలకు ఇది రూ. 66,58,288 అవుతుంది. 25 సంవత్సరాలకు అయితే ఇది రూ. 1,03,08,015 అవుతుంది. అంటే ఇక్కడ నెలకు రూ. 12,500 తో 25 సంవత్సరాలకు కోటికిపైగా వస్తుందన్నమాట. ఇక్కడ మొత్తం పెట్టుబడి రూ. 37,50,000 గా ఉంటుంది.