పారిస్ 2024 వేదికగా గత 19 రోజులుగా జరిగిన ఒలింపిక్స్ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ముగింపు వేడుకలు చూపరులను ఆకట్టుకున్నాయి. ప్రపంచ క్రీడా సంబురంగా పేర్కొనే.. ఒలింపిక్స్ ఈసారి కూడా అదే జోష్ నింపింది. జులై 26న విశ్వక్రీడలకు తెరలేవగా.. ఆగస్టు 11న క్లోజ్ అయ్యాయి. సెన్ నదిలో ఆరంభోత్సవ వేడుకలు మొదలు.. ప్రధాన స్టేడియంలో ముగింపు వేడుకల వరకూ అన్నీ అనుకున్నట్లుగానే జరిగాయి. మధ్యలో కొన్ని వివాదాలు తలెత్తినా.. చివరకు ఒలింపిక్స్ నిర్వహణ విషయంలో మాత్రం పారిస్ విజయం సాధించింది.
ముగింపు వేడుకల్లో డ్యాన్సర్లు, సంగీత కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. భారత్ తరఫున పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను భాకర్, ఈ ఒలింపిక్స్‌తో హాకీకి గుడ్‌బై చెప్పిన హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేష్‌లు పతకధారులుగా వ్యవహించారు. గేమ్స్‌లో పాల్గొన్న అన్ని దేశాలకు చెందిన అథ్లెట్లను ఉత్సాహపరిచేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2028 ఒలింపిక్స్ పోటీలు లాస్ ఏంజెలెస్ వేదికగా జరగనున్నాయి.
ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 32 క్రీడాంశాల్లో 329 స్వర్ణ పతకాల కోసం 206 దేశాలతో పాటు ఒలింపిక్ శరణార్థుల జట్టు (ఐవోసీ) నుంచి మొత్తంగా 10,714 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల కోసం చైనా, అమెరికాలు నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డాయి. చివరి రోజు వరకు పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చైనా అనూహ్యంగా రెండో ప్లేసుకు పడిపోయింది. చివరి రోజు ఈవెంట్‌లలో అమెరికా సత్తాచాటి స్వర్ణ పతకాలు సాధించింది.
అగ్రరాజ్యం అమెరికా అథ్లెట్లు ఏకంగా 40 స్వర్ణ పతకాలను కొల్లగొట్టారు. రజత పతకాలు 44, కాంస్య పతకాలు 42 సాధించారు. మొత్తంగా అమెరికా 126 పతకాలను సొంతం చేసుకుంది. రెండో స్థానంలో ఉన్న చైనా సైతం అమెరికాతో సమానంగా 40 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. కానీ 27 రజత పతకాలు, 24 కాంస్య పతకాలతో మొత్తం 91 పతకాలు సాధించింది. దీంతో రెండో స్థానానికి పడిపోయింది.
ఇక టోక్యో 2020 ఒలింపిక్స్‌లో 7 పతకాలతో భారత్ 48వ స్థానంలో నిలిచింది. అప్పుడు ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు వచ్చాయి. కానీ పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలతో 71వ స్థానంలో నిలిచింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా 2028 ఒలింపిక్స్ జరగనున్నాయి.