చీలమండ గాయం, శస్త్రచికిత్స నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ జరిగినప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. వాస్తవానికి దులీప్ ట్రోఫీలోనే అతడు ఆడతాడని అంతా భావించారు. కానీ గాయం ఇంకా మానకపోవడంతో అతడి రీఎంట్రీ ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న షమీ.. నవంబర్‌లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సిరీస్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు.
ఇందులో భాగంగా మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు అతడి రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. రంజీలో బెంగాల్ తరఫున ఆడే షమీ.. ఆ జట్టు ఆడే తొలి రెండు మ్యాచుల్లో పాల్గొనే అవకాశం ఉంది. అక్టోబర్ 11న యూపీతో, అక్టోబర్ 18న బిహార్‌తో బెంగాల్ తలపడనుంది. ఈ రెండు మ్యాచుల మధ్య తక్కువ గ్యాప్ ఉండటంతో.. కనీసం ఒక్క మ్యాచులో అయినా ఆడాలని షమీ భావిస్తున్నాడు. ఇందులో మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకుని.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో జాతీయ జట్టు తరఫున రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. రెండో టెస్టు అక్టోబర్ 24న, మూడో టెస్టు నవంబర్ 1న జరగనుంది. ఈ మూడు మ్యాచుల్లో కనీసం ఒక్కదాంట్లో అయినా షమీ ఆడే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ నాటికి పూర్తి ఫిట్‌గా ఉండాలని అతడు భావిస్తున్నాడు. అందుకు అనుగుణంగా సిద్ధం అవుతున్నాడు. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందే భారత్.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. కానీ బోర్డర్ గావస్కర్ ట్రోఫీని వరుసగా ఐదోసారి కైవసం చేసుకోవాలంటే.. షమీ లాంటి పేసర్ జట్టులో ఉండటం అవసరం. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే బీసీసీఐ కూడా అతి విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తోంది. నవంబర్ 22నుంచి భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
కాగా 34 ఏళ్ల మహమ్మద్ షమీ.. చివరగా భారత్ తరఫు వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత చీలమండ గాయం, దానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం బౌలంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2023-2025) ఫైనల్ చేరాలంటే.. భారత్‌కు ఆస్ట్రేలియా సిరీస్ కీలకం. ఇందులో గెలిస్తేనే వరుసగా మూడోసారి భారత్.. ఫైనల్ చేరుతుంది. దీంతో అప్పటివరకు భారత పేస్ త్రయం జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలు ఫిట్‌గా ఉండాలని భారత యాజమాన్యం భావిస్తోంది. షమీ ఇప్పటివరకు భారత తరఫున 64 టెస్టు మ్యాచులు ఆడాడు. అందులో 229 వికెట్లు పడగొట్టాడు.