ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఐసీసీ టోర్నీ నిర్వహించేందుకు సిద్ధమైన పాకిస్థాన్.. అందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కొత్త స్టేడియాల నిర్మాణంతో పాటు వసతుల ఏర్పాటును చక్కదిద్దే పనిలో పడింది. ఇందుకోసం కోట్లాది రూపాయలని ఖర్చు చేస్తోంది. అయితే ఇంత చేస్తున్నా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం.. ఒక విషయం మాత్రం కంగారు పెడుతోంది. అదే భారత్. అవును.. ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా వస్తుందా? లేదా? ఒకవేళ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ పట్టుబడుతుందా? అనే ప్రశ్నలు పీసీబీకి తలెత్తుతూనే ఉన్నాయి.
అవి చాలవన్నట్లు సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా కూడా ఇదే తరహాలో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగనుందని, షెడ్యూల్ మారనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ విషయంపై స్పందించింది.
“ఛాంపియన్స్ ట్రోఫీ తేదీలు మారబోతున్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేయడం బాధాకరం. భద్రతా పరమైన కారణాలతో టోర్నీ షెడ్యూల్ మారుస్తున్నామని.. పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చెప్పినట్లుగా కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అయన మాటలను వక్రీకరించారు. దీంతో వారు కావాలనే ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారు,” అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 ప్రారంభం కానుంది. ఆరంభ పోరు, ఒక సెమీస్ మ్యాచ్ కరాచీలో.. రెండో సెమీఫైనల్‌కు రావల్పిండిలో జరుగుతుందని ఇటీవల పీసీబీ ప్రతిపాదిత షెడ్యూల్‌లో తెలిపింది. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మార్చిన 9న లాహోర్ వేదికగా మ్యాచ్ జరుగుతుందని పేర్కొంది. ఇదంతా సక్రమంగానే ఉన్నా.. భారత్.. పాకిస్థాన్‌కు వెళ్తుందా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు 2008 సంవత్సరం నుంచి పాకిస్థాన్‌లో పర్యటించడం లేదు. దీంతో అప్పటి నుంచి భారత్-పాక్‌లు కేవలం టీ20 ప్రపంచకప్, వన్డే ప్రంపచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లాంటి టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. గతేడాది పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరిగినా.. భారత్ ఆడే మ్యాచ్‌లు మాత్రం శ్రీలంక వేదికగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అలాగే హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిహించేందుకు ప్రయత్నిస్తోందా? అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భయపడుతోంది.