గత ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించి అత్యధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన గతేడాది ఏకంగా రూ.92 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారు. ఈ మేరకు 2023-24లో భారీ స్థాయిలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీల జాబితాతో 'ది స్టార్ కాస్ట్' పేరుతో ఫార్చూన్ ఇండియా మ్యాగజైన్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిలవగా.. తమిళ నటుడు తలపతి విజయ్ రూ.80 కోట్లు చెల్లించి రెండో స్థానంలో నిలిచారు.
ఇక ఫార్చూన్ ఇండియా విడుదల చేసిన అడ్వాన్స్ ట్యాక్స్ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో నిలిచారు. ఆయన గతేడాది రూ. 75 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు నివేదిక పేర్కొంది. ఇక ఆయన తర్వాత బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గత సంవత్సరంలో రూ.71 కోట్లు చెల్లించి నాలుగో స్థానంలో నిలిచారు. వారి తర్వాత చూసుకుంటే సెలబ్రిటీల లిస్టులోకి దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేరారు. 2023-24 ఆర్థిక ఏడాదిలో కింగ్ కోహ్లీ ఏకంగా రూ.66 కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించి 5వ స్థానంలో నిలిచినట్లు ఫార్చూన్ ఇండియా నివేదిక వెల్లడించింది. దేశంలోని క్రికెటర్ల జాబితాలో చూసుకుంటే కింగ్ కోహ్లీనే టాప్‌లో నిలవడం గమనార్హం.
ఇక సిని, వినోద పరిశ్రమలోని సెలబ్రిటీల్లో చూసుకుంటే అత్యధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన వారిలో అజయ్ దేవగన్ రూ.42 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత రణబీర్ కపూర్ రూ.36 కోట్లు, హృతిక్ రోషన్ రూ.28 కోట్లు, కపిల్ శర్మ రూ.26 కోట్లు, కరీన కపూర్ రూ.20 కోట్లు, షాహిద్ కపూర్ రూ.14 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ రూ.14 కోట్లు, కియారా అడ్వానీ రూ.12 కోట్లు చెల్లించగా.. కత్రినా కైఫ్, పంకజ్ త్రిపాఠి రూ.11 కోట్లు, ఆమిర్ ఖాన్ రూ.10 కోట్లు కట్టారు.
అల్లు అర్జున్ టాప్..
ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరిపోయారు. ఈ యంగ్ హీరో గత ఆర్థిక సంవత్సరం 2023-24లో ఏకంగా రూ. 14 కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు ఫార్చూన్ ఇండియా నివేదిక తెలిపింది. తెలుగు చిత్ర పరిశ్రమలో చూసుకుంటే అల్లు అర్జున్ టాప్‌లో నిలిచినట్లు తెలుస్తోంది. ఇక క్రికెటర్ల విషయానికి వస్తే విరాట్ కోహ్లీ తర్వాత ఎంఎస్ ధోనీ రూ.38 కోట్లు, సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ రూ.28 కోట్లు, రూ.33 కోట్లు చెల్లించారు. హార్దిక్ పాండ్యా రూ.13 కోట్లు, రిషబ్ పంత్ రూ.10 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు నివేదిక పేర్కొంది.