మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరు సోమవారం నాటికి మూడో రోజుకు చేరుకోగా, పరిస్థితి ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఆశ్చర్యకరమైన రీతిలో క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సంచలన ప్రకటన చేసింది. ఈ దాడిలో అత్యంత శక్తివంతమైన 'ఖైబర్' మిస్సైళ్లను వినియోగించినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. నెతన్యాహు కార్యాలయంతో పాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా తాము టార్గెట్ చేశామని, ఈ దాడి తర్వాత నెతన్యాహు పరిస్థితి ఏంటన్నది తెలియదని ఐఆర్జీసీ పేర్కొంది. ఈ ప్రకటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. తమ ప్రకటనలో ఇజ్రాయెల్ ప్రధానిని 'క్రిమినల్'గా అభివర్ణిస్తూ, జియోనిస్ట్ పాలన అంతమే తమ లక్ష్యమని ఇరాన్ ఆర్మీ స్పష్టం చేసింది.గత శనివారం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో రగిలిపోతున్న ఇరాన్, దీనికి ప్రతీకారంగానే తాము ఈ విధ్వంసకర దాడులకు దిగుతున్నట్లు ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్లో ఇప్పటివరకు 555 మంది మరణించినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ గణాంకాలను విడుదల చేసింది. ఇది ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద విషాదంగా మారడంతో, ఆ దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది.తాజా దాడుల్లో తెల్ అవీవ్‌లోని ప్రధాని కార్యాలయంతో పాటు హైఫాలోని కీలక భద్రతా, సైనిక కేంద్రాలు, తూర్పు జెరూసలెంపై కూడా ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చాయి. జెరూసలెం పరిసరాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఏఎఫ్‌పీ జర్నలిస్టులు రిపోర్ట్ చేశారు. అయితే, ఇజ్రాయెల్ సైన్యం మాత్రం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని ప్రకటించింది. ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను తమ ఐరన్ డోమ్, ఇతర రక్షణ వ్యవస్థలు గాల్లోనే అడ్డుకున్నాయని, ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి.ఈ యుద్ధం ఇప్పుడు కేవలం ఇరు దేశాలకే పరిమితం కాకుండా గల్ఫ్ ప్రాంతం మొత్తానికి విస్తరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల కారణంగా దుబాయ్, అబుధాబీ, దోహా, మనామా వంటి ప్రముఖ నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. కువైట్‌లోని అమెరికన్ ఎంబసీ సమీపంలో దట్టమైన నల్లటి పొగలు ఎగిసిపడగా, అమెరికన్ యుద్ధ విమానాలు కూలినట్లు, అయితే సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. గల్ఫ్ ప్రాంతంలో జరిగిన ఇరాన్ దాడుల్లో ఐదుగురు మరణించారు. అటు లెబనాన్ సరిహద్దుల నుంచి హిజ్బుల్లా కూడా రాకెట్లతో విరుచుకుపడుతుండటంతో, ఇజ్రాయెల్ బెయిరూట్ దక్షిణ ప్రాంతాలపై ప్రతిదాడులు చేస్తోంది.పరిస్థితి చేయిదాటుతుండటంతో అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లీయెన్ ఇరాన్ దాడులను అసాధారణమైన, విచక్షణారహితమైనవి అని తీవ్రంగా ఖండించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం తక్షణం డీ-ఎస్కలేషన్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఏది ఏమైనా, ఖమేనీ మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో మొదలైన ఈ యుద్ధం ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa