విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దర్శనం కోసం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం నేపథ్యంలో విజయవాడ దుర్గ గుడి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మార్చి మూడో తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు కనకదుర్గమ్మ ప్రధాన ఆలయం సహా ఉపాలయాల కవాట బంధనం చేయనున్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో పౌర్ణమి రోజున నిర్వహించే ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ రద్దు చేసినట్లు దుర్గ గుడి దేవస్థానం అధికారులు ప్రకటించారు. చండీ హోమం, శాంతి కళ్యాణం, పంచ హారతులు, పల్లకీ సేవ సహా ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు దుర్గ గుడి దేవస్థానం ప్రకటించింది.
అనంతరం మార్చి నాలుగో తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు దుర్గమ్మ ప్రధాన ఆలయం, ఉపాలయాల కవాట ఉద్ఘాటన చేయనున్నారు. అనంతరం సుప్రభాతం, స్నపనాభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలు ఉండనున్నాయి. బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి భక్తులను అమ్మవారి సర్వదర్శనం కోసం అనుమతిస్తారు. నవగ్రహ శాంతి హోమం, వస్త్రం సేవ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం రద్దు చేశారు. అలాగే బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు నిర్వహించే ఆర్జిత సేవలను గంట ఆలస్యంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోవాలని దుర్గ గుడి దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
అలాగే చంద్రగ్రహణం మధ్యాహ్నం మూడు గంటల 20 నిమిషాలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు విడుస్తుంది. మొత్తం 3 గంటల 28 నిమిషాల పాటు గ్రహణ కాలం కొనసాగనుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను మూసివేయనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకూ మూసివేయనున్నారు. చంద్రగ్రహణం పూర్తైన తర్వాత ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, స్లాటెడ్ సర్వదర్శనాలను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ స్థానిక ఆలయాలు కూడా మంగళవారం మూసివేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa