కొత్త కారు కొనుగోలు చేసే వారికి టాటా మోటార్స్ అదిరే శుభవార్త అందించింది. ఫెస్టివల్ ఆఫ్ కార్స్ పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా అమెజింగ్ డీల్స్ అందిస్తోంది. పాపులర్ కార్లు, ఎస్‌యూవీలపై ఏకంగా రూ.2.05 లక్షల వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్ ప్రకటన ప్రకారం ఈ స్పెషల్ ఫెస్టివ్ ఆఫర్ అనేది లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది. వచ్చే నెల అక్టోబర్ 31, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, కంపెనీకి చెందిన పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ మోడళ్లపై తగ్గింపు పొందవచ్చని తెలిపింది.
టాటా కార్లు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఈ ప్రత్యేకమైన ఆఫర్ సద్వినియోగం చేసుకుంటారనే నమ్మకం ఉందని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమెర్షియల్ ఆఫిసర్ వివేక్ శ్రీవాత్స పేర్కొన్నారు. 'పండగల సీజన్ మొదలైన క్రమంలో మా విలువైన కస్టమర్ల కోసం పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటించేందుకు ఉత్సాహంగా ఉన్నాం. ఐసీఈ వాహనాలపై రూ.2.05 లక్షల వరకు బెనిఫిట్స్ కల్పిస్తున్నాం. ధరల తగ్గింపుతో పాటు ఎక్స్చేంజ్, క్యాష్ బెనిఫిట్స్‌తో ఈ ఏడాది పండగ సెలబ్రేషన్స్ ఉండనున్నాయి. కొత్త ప్రయాణం మొదలు పెట్టేందుకు ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు' అని పేర్కొన్నారు వివేక్ శ్రీవాత్స.
ఈ ఆఫర్‌లో భాగంగా టాటా మోటార్స్‌కు చెందిన వివిధ కార్ల ప్రారంభ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టాటా టియాగో స్టార్టింగ్ ప్రైస్ రూ.4.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉండగా.. టాటా ఆల్ట్రోజ్ రూ. 6.49 లక్షలు, టాటా నెక్సాన్ రూ. 7.99 లక్షలు, టాటా హ్యారియర్ రూ.14.99 లక్షలు, టాటా సఫారీ రూ. 15.49 లక్షలుగా కంపెనీ తెలిపింది. రూ.2.05 లక్షల వరకు ధర తగ్గింపుతో పాుట కస్టమర్లు రూ.45 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ సైతం పొందవచ్చని కంపెనీ తెలిపింది.
డీలర్‌షిప్‌ల వద్ద ఇన్వెంటరీ బిల్డ్ చేసే క్రమంలో ఈ ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది. ఆగస్టు నెలలో డీలర్ల వద్ద కార్ల విక్రయాలు 4.5 శాతం మేర పడిపోయాయి. ఈ ఆర్థిక ఏడాదిలో వరుసగా మూడో నెలలో విక్రయాలు పడిపోవడం గమనార్హం. ఈ క్రమంలో మళ్లీ సేల్స్ పెంచేందుకే ఈ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు.. ఇండియాలో ఈ ఏడాది మారుతీ సుజుకీ డీలర్ సేల్స్ 8.5 శాతం, హ్యూందాయ్ మోటార్స్ సేల్స్ 12.9 శాతం, టాటా మోటార్స్ సేల్స్ 2.7 శాతం మేర పడిపోయాయి.