వాహనదారులకు అదిరే శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ రహదారులపై తరుచూ ప్రయాణించే వారిలో చాలా మంది తాము తక్కువ దూరం ప్రయాణించిన టోల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వారందరికీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు అమలు చేసేందుకు మరో అడుగు వేసింది. తాజాగా ఈ విధానానికి కేంద్రం ఉపరితల రవాణా శాఖ నోటిఫై చేసింది. ఈ మేరకు నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
కొత్త రూల్స్ ప్రకారం.. టోల్ గేట్ల వద్ద కొత్తగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా టోల్ ఛార్జీలు వసూలు చేసే విధానం అమలులోకి రానుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫాస్టాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికత వంటి వాటికి ఇది అదనంగా ఉంటుంది. ఈ మూడు విధానాలూ అందుబాటులో ఉంటాయి. ఇకపై నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌తో ఆన్‌బోర్డు యూనిట్ కలిగి ఉన్న వాహనాలు టోల్ గేట్ల మీదుగా వెళ్లినప్పుడు సదరు వాహనం ప్రయాణిచిన దూరానికే టోల్ ఫీ అనేది ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.
అదేవిధంగా ఈ వాహనాలకు ప్రత్యేక లైన్లు సైతం ఏర్పాటు చేయనున్నారు. నావిగేషన్ డివైజ్‌లోని వాహనాలకు సాధారణ టోల్ ఛార్జీలే ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పాటు కొత్తగా 20 కిలోమీటర్ల వరకు జీరో టోల్ కారిడార్ తీసుకొచ్చారు. అంటే నేషనల్ హైవేలపై 20 కిలోమీటర్ల వరకు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆపైన ప్రయాణించినప్పుడు మాత్రమే దూరానికి తగినట్లుగా టోల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. తొలినాళ్లలో మాన్యువల్‌గా డబ్బులు చెల్లించే విధానం ఉండేది. దాని స్థానంలో ఫాస్టాగ్ తీసుకొచ్చి వెయిటింగ్ సమయాన్ని తగ్గించారు. కొన్ని సెకన్లలోనే పేమెంట్లు పూర్తి వాహనాలు వెళ్లేందుకు వీలు కలిగింది. అయితే కిలోమీటర్లతో సంబంధం లేకుండా టోల్ కట్టాల్సి వస్తుంది. దీంతో చాలా మంది వాహనదారులు తాము తక్కువ దూరమే ప్రయాణించినా మొత్తం ట్యాక్స్ కట్టాల్సి వస్తోందని అనేవారు. ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త విధానం ద్వారా ఎంత దూరం ప్రయాణిస్తే అంతే ట్యాక్స్ కడతారు. టోల్ గేట్ల వద్ద అసలు ఆగాల్సిన పనే ఉండదు. ప్రత్యేక లైన్ల ద్వారా రయ్ రయ్ మంటు వెళ్లిపోవచ్చు. ముందుగా ప్రధాన జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై ఈ కొత్త శాటిలైట్ విధానాన్ని తీసుకురానుంది కేంద్రం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేయనుంది.