దేశీయ టెక్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లోని చాలా మంది ఉద్యోగులకు ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు అందాయి. ఫారం 26ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఏఐఎస్‌లో పేర్కొన్న ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్)తో ఉద్యోగులు దాఖలు చేసిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో పేర్కొన్న అమౌంట్ మధ్య వ్యత్యాసం గుర్తించిన క్రమంలో నోటీసులు పంపించింది ఆదాయపు పన్ను శాఖ. అయితే, ఉద్యోగులు ఆందోళన చెందవద్దని తమ ఉద్యోగులకు భరోసా ఇచ్చింది టీసీఎస్ కంపెనీ. సాంకేతిక సమస్య వల్ల టీడీఎస్ అప్డేట్ కాలేదని, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది. టీడీఎస్‌లో తేడాల సమస్యను పరిష్కరించిన క్రమంలో ఉద్యోగుల ఐటీఆర్లు ప్రాసెసింగ్ అవుతాయని, ఇది త్వరలోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
అయితే, పన్ను చెల్లింపుదారులు ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. మీకు సంబంధించిన ఫారం 26ఏఎస్, ఏఐఎస్, ఫారం 16 పార్ట్ ఏలో పేర్కొన్న టీడీస్ అమౌంట్‌లో తేడాలు గుర్తించి మీకు సైతం ట్యాక్స్ డిమాండ్ నోటీసులు పంపిస్తే ఎలా? ఏం చేయాలి? అనేది తెలుసుకోవాలి. సాధారణంగా ఇలా ఐటీఆర్‌లో పేర్కొన్న వివరాల్లో వ్యత్యాసాలు గుర్తిస్తే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 143(1) ప్రకారం ట్యాక్స్ డిమాండ్ నోటీసులు పంపిస్తారు అధికారులు. టీడీఎస్ అనేది ఫారం 26 ఏఎస్, ఏఐఎస్‌లో కనిపిస్తుంది. ఇది ఫారం 16 పార్ట్‌లో పేర్కొన్న అమౌంట్‌తో సరిపోలకపోతే.. వాటిని సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఫారం 16 అనేది టీడీఎస్ సర్టిఫికెట్. దీనిని పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం జారీ చేస్తుంది. ఫారం 26ఏఎస్‌లో పేర్కొన్న టీడీఎస్ మాత్రమే ఐటీఆర్‌లో రీఫండ్ క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఫారం 16 పార్ట్ ఏతో పోలిస్తే తక్కువగా ఉంటే దానిని సరిచేయాలని ట్యాక్స్ డిడక్టర్‌ను సంప్రదించాలి. అప్పుడు వారు ఫారం 26ఏఎస్‌లో సరిచేస్తారు.
ఫారం 26ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో తప్పులు దొర్లినట్లయితే వెంటనే ట్యాక్స్ డిడక్టర్‌ను సంప్రదించి ట్యాక్స్ అమౌంట్‌లో తప్పులను సరి చేయాలని రిక్వెస్ట్ చేయాలి. ట్యాక్స్ డిడక్టర్ అంటే మీ కంపెనీ అని చెప్పవచ్చు. సరి చేసిన తర్వాత మీరు రివైజ్డ్ టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ రివైజ్డ్ టీడీఎస్ రిటర్న్స్ ట్యాక్స్ విభాగం ప్రాసెసింగ్ చేస్తుంది. సరైన వివరాలు ఫారం 26ఏఎస్‌లో కనిపిస్తాయి. ఈప్రాసెస్ పూర్తయ్యేందుకు కనీసం నెల రోజులు పడుతుందని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ ఫారం 26ఏఎస్ చెక్ చేసుకోవాలని, అప్పుడే సరైన ట్యాక్స్ డిడక్షన్లు తెలుస్తాయంటున్నారు. ఫారం 26ఏఎస్‌లో పేర్కొన్న టీడీఎస్, ఐటీఆర్ ఫైలింగ్ కోసం కంపెనీ నుంచి పొందిన టీడీఎస్ సర్టిఫికెట్‌లో ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఇలా నోటీసులు వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని, తప్పులను సరి చేసుకుని రివైజ్డ్ టీడీఎస్ ఫైల్ చేయాలని సూచిస్తున్నారు.