దిగ్గజ రిటైల్ హైపర్ మార్కెట్ చెయిన్ లులు గ్రూప్.. భారత్‌లో వేగంగా తన కార్యకలాపాల్ని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ విరివిగా పెట్టుబడులు పెడుతోంది. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మాల్స్ తెరుస్తోంది. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్.. లులు గ్రూప్ పేరిటే ఉంది. అతిపెద్ద మాల్.. కేరళ తిరువనంతపురంలో ఉండగా.. రెండోది కూడా లులు పేరిటే కొచ్చిలో ఉంది. ఇక మూడో స్థానంలో మరో ప్రముఖ సంస్థ డీఎల్ఎఫ్‌కు నోయిడాలో ఉందని చెప్పొచ్చు. ఇక లులు గ్రూప్ ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సుమారు రూ. 4 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లులు గ్రూప్‌కు పోటీగా.. డీఎల్ఎఫ్ సంస్థ కూడా కీలక ప్రకటన చేసింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ కమ్ రిటైల్ సంస్థ డీఎల్ఎఫ్.. తన రిటైల్ పోర్ట్‌ఫోలియోను విస్తృతం చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే దేశంలోని పలు ప్రాంతాల్లో మాల్స్‌ను శరవేగంగా నిర్మించేందుకు సంకల్పించుకుంది. ఇప్పుడు ఢిల్లీ, గురుగ్రామ్, గోవా ప్రాంతాల్లో 3 పెద్ద మాల్స్ నిర్మాణాలపై ప్రకటన చేసింది. ఈ మేరకు తాజాగా డీఎల్ఎఫ్ వైస్ ఛైర్మన్ అండ్ సీఎండీ (రెంటల్ బిజినెస్) శ్రీరామ్ ఖట్టర్ చెప్పారు.
కొవిడ్ సమయంలో అనుకోని అవాంతరాలతో.. తమ మాల్ విస్తరణ ప్లాన్ అర్ధంతరంగా ఆపివేశామని.. కానీ మళ్లీ గత రెండు, మూడేళ్లుగా షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా తమ రిటైల్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసుకునే దిశగా కంపెనీ దృష్టి సారించిందని అన్నారు ఖట్టర్.
'మేం ఇప్పుడు 3 అతిపెద్ద మాల్స్ నిర్మిస్తున్నాం. ఒకటేమో సెంట్రల్ వెస్ట్ ఢిల్లీలోని మోతీ నగర్‌లో, గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ఫేజ్- 5 లో, గోవాలోని పాంజిమ్‌లో ఉంటాయి.' అని ఖట్టర్ తమ భవిష్యత్తు ప్రణాళికల్ని వివరించారు. ప్రస్తుతానికి డీఎల్ఎఫ్‌కు దేశవ్యాప్తంగా 5 మిలియన్ చదరపు అడుగుల మేర (50 లక్షల చ.అ.) రిటైల్ పోర్ట్‌ఫోలియో ఉండగా.. ఈ 3 కొత్త మాల్స్ ప్రారంభంతో అది ఏకంగా 6.3 మిలియన్ చదరపు అడుగులకు చేరుతుందని తెలుస్తోంది. అంటే 3 కొత్త మాల్స్‌నే ఏకంగా 13 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టనున్నారు. ఇంత విస్తీర్ణంలో అంటే చాలా పెద్ద మాల్స్‌గా చెప్పుకోవచ్చు. మరి ఇది లులును అధిగమిస్తుందో లేదో అహ్మదాబాద్ మాల్ నిర్మాణం తర్వాత తెలుస్తుంది.
ఇక ఢిల్లీ, గురుగ్రామ్‌ల్లో హై స్ట్రీట్ మాల్స్, గోవాలో ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ మాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఖట్టర్ చెప్పుకొచ్చారు. 2026 ఏప్రిల్ కల్లా ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని స్పష్టత ఇచ్చారు. డీఎల్ఎఫ్ లిమిటెడ్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 646 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ.