దేశీయ యూనికార్న్ సంస్థ, ప్రముఖ హాస్పిటాలిటీ చెయిన్ ఓయో.. అమెరికాలో తన కార్యకలాపాల్ని వేగంగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. దీంట్లో భాగంగానే.. అమెరికాకు చెందిన ప్రముఖ లాడ్జింగ్ ఫ్రాంఛైజీ, స్టూడియో 6, మోటెల్ 6 వంటి ప్రముఖ బాండ్స్ నడుపుతున్న జీ6 హాస్పిటాలిటీ సంస్థను కొనుగోలు చేయనుంది. బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి 525 మిలియన్ డాలర్ల ఆల్ క్యాష్ డీల్‌తో దీనిని కొనుగోలు చేయనున్నట్లు ఓయో సంస్థ పేరెంట్ కంపెనీ ఓర్వల్ స్టేస్ శనివారం రోజు ప్రకటించింది. ఆల్ క్యాష్ డీల్ అంటే పూర్తి నగదు రూపంలోనే ఈ ట్రాన్సాక్షన్ జరగనుందన్న మాట. ఇక 525 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 4 వేల కోట్లకుపైనే ఉంది.
భారత్‌లోని ప్రధాన నగరాలు సహా చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఓయో సేవలు అందిస్తోంది. ఇది 2019లోనే అమెరికాలో కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు 35 రాష్ట్రాల్లో మొత్తంగా 320 కిపైగా హోటల్స్ నిర్వహిస్తోంది. కిందటేడాది 100 హోటల్స్ చేర్చుకుంది. ఈ సంవత్సరం మరో 250 హోటళ్లను తన పోర్ట్ ఫోలియోలో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నేపథ్యంలోనే మోటెల్ 6, స్టూడియో 6 బ్రాండ్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది ఓయో. 2024 నాలుగో త్రైమాసికానికల్లా ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది ఓయో. అంతర్జాతీయంగా ఒక స్టార్టప్ కంపెనీ.. తన ఉనికిని చాటుకోవడంలో ఈ కొనుగోలు కీలక మైలురాయిగా నిలుస్తుందని ఓయో ఇంటర్నేషనల్ సీఈఓ గౌతమ్ స్వరూప్ ఈ సందర్భంగా తెలిపారు. మోటెల్ 6కు అమెరికా వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు.
ఓయోకు ఉన్న ఈ అనుభవంతో మరింత వృద్ధి సాధిస్తామని.. వేరే సంస్థగానే దీన్ని కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు స్వరూప్. మోటెల్ 6 బ్రాండ్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ బ్లాక్ స్టోన్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. ఇక అమెరికా, కెనడాల్లో మోటెల్ 6కు సుమారు 1500 కుపైగా హోటల్స్ ఉన్నాయి. మరోవైపు.. ఐపీఓ సన్నాహాల్లో ఉన్న వేళ ఓయో దీన్ని కొనుగోలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.