తమ కస్టమర్లకు అధిక లాభం అందించే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్లు అందిస్తోంది. అందులో అమృత్ కలశ్ ఎఫ్‌డీ స్కీమ్ అత్యంత ఆదరణ పొందింది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ టెన్యూర్ 400 రోజులు మాత్రమే. అయితే, ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు గడువు దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 30, 2024 వరకే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన క్రమంలో మరోసారి పొడిగిస్తారనే అంచనాలు లేవు. బ్యాంక్ నుంచి సైతం ఎలాంటి ప్రకటనలు రాలేదు. అందకే అధిక వడ్డీ రావాలనుకునే వారు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
అమృత్ కలశ్ ఎఫ్‌డీ పథకాన్ని 2023, ఏప్రిల్ 12వ తేదీన లాంచ్ చేసింది ఎస్‌బీఐ. కస్టమర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న క్రమంలో ఈ పథకాన్ని పలుమార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. అమృత్ కలశ్ ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా ఇతర పథకాలతో పోలిస్తే సాధారణ కస్టమర్లతో పాటు సీనియర్ సిటిజన్లకు 30 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ కల్పిస్తోంది. ప్రస్తుతం అమృత్ కలశ్ ఎఫ్‌డీ పథకంలో సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 7.6 శాతం మేర వడ్డీ అందిస్తోంది. అయితే, ఈ పథకం మాదిరిగా మెచ్యూరిటీ టెన్యూర్ 1-2 ఏళ్ల మధ్య ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై నార్మల్ కస్టమర్లకు 6.8 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.3 శాతం వడ్డీ అందిస్తోంది.
రూ.5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోన్న అమృత్ కలశ్ ఎఫ్‌డీ స్కీమ్ 400 రోజుల టెన్యూర్ ఉంటుంది. ఇందులో ఒక సాధారణ కస్టమర్ (60 ఏళ్ల వయసు లోపు) రూ.5 లక్షల జమ చేసినట్లయితే 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం మెచ్యూరిటీ తర్వాత వడ్డీ రూ. 38,850 వరకు లభిస్తుంది. మొత్తంగా చేతికి రూ. 5,38,850 లభిస్తాయి. అదే ఒక సీనియర్ సిటిజన్ (60 ఏళ్ల వయసు దాటిన వారు) రూ.5 లక్షలు జమ చేసినట్లయితే 7.6 శాతం వడ్డీ వర్తిస్తుంది. దీని ప్రకారం టెన్యూర్ ముగిశాక వడ్డీ రూ. 41,600 వరకు వస్తుంది. అంటే మొత్తంగా చేతికి రూ. 5,41,600 వరకు అందుతుంది.