మీరు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నారా. చాలా మందికి ఎఫ్‌డీలపై వడ్డీ వస్తుందని తెలుసు కానీ.. సేవింగ్స్ అకౌంట్లపైనా వడ్డీ వస్తుందని పెద్దగా తెలిసుండకపోవచ్చు. అయితే ఇందుకోసం మీ పొదుపు ఖాతాలో నిర్దిష్ట మొత్తం మెయింటెయిన్ చేస్తుండాలి. అప్పుడు మాత్రమే.. దానికి అనుగుణంగా ఉండే వడ్డీ రేట్ల ప్రకారం వడ్డీని అకౌంట్లో జమ చేస్తుంటాయి బ్యాంకులు. ఇక ఈ వడ్డీ రేట్లను ప్రతి బ్యాంక్ కూడా దాదాపు ప్రతి నెలా సవరిస్తుంటుందని చెప్పొచ్చు. ఈ వడ్డీ రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా కూడా ఉండొచ్చు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు.. కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు దేశంలోని ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయిన.. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు.. ఎఫ్‌డీ, పొదుపు ఖాతాలపై కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. రూ. 3 కోట్లకు లోబడిన ఎఫ్‌డీలపై ఈ సవరించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 4 నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. సేవింగ్స్ ఖాతాలపైనా వడ్డీ రేట్లను సవరించినట్లు బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది.
వడ్డీ రేట్లు సవరించిన తర్వాత.. FD లపై సాధారణ ప్రజలకు వారం నుంచి పదేళ్ల వ్యవధి డిపాజిట్లపై కనీసం 4 శాతం నుంచి గరిష్టంగా 8.65 శాతం వడ్డీ అందుతుండగా.. సీనియర్ సిటిజెన్లకు 4.50 శాతం నుంచి 9.10 శాతం వస్తుంది. 7 రోజుల నుంచి 90 రోజుల వ్యవధి డిపాజిట్స్‌పై గరిష్టంగా 5 శాతం వరకు వడ్డీ వస్తుంది. 6 నెలల ఒక రోజు డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. ఇక ఏడాది పైనుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్లపై 8 శాతానికిపైగానే వడ్డీ వస్తుంది.
అత్యధికంగా రెగ్యులర్ సిటిజెన్లకు 8.65 శాతం రెండేళ్ల 2 రోజుల వ్యవధి డిపాజిట్లపై అందుతుంది. ఇక్కడ రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీకి చేతికి రూ. 86,703 వడ్డీ వస్తుంది. మొత్తం రూ. 5,86,703 అందుతుందన్నమాట. 3 సంవత్సరాల డిపాజిట్‌పై ఇక్కడ 8.60 శాతం వడ్డీ రేటు చొప్పున రూ. 1,26,139 వడ్డీ అందుతుంది.
ఇదే సీనియర్ సిటిజెన్లకు రెండేళ్ల ఒకరోజు, రెండేళ్ల రెండు రోజులు, అదే విధంగా.. రెండేళ్ల 3 రోజుల నుంచి మూడేళ్ల వరకు FD పై అత్యధికంగా 9.10 శాతం వడ్డీ వస్తుంది. ఇక్కడ మూడు సంవత్సరాలకు చూస్తే.. 5 లక్షలు జమ చేస్తే.. రూ. 1,33,470 వడ్డీ వస్తుంది. చేతికి మొత్తం రూ. 6,33,470 అందుతున్నమాట.
అయితే.. చిన్న బ్యాంకులు అంత సురక్షితం కావు. వీటి దగ్గర పెద్దగా మూలధనం ఉండకపోవచ్చు. అందుకే బ్యాంకింగ్ సేవలు నిర్వహించడం కష్టతరం అవుతుంటుంది. ఇక్కడ డిపాజిట్లపై గరిష్టంగా రూ. 5 లక్షల వరకు మాత్రమే.. ఆర్బీఐ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వర్తిస్తుంది. అంటే ఒకవేళ బ్యాంక్ దివాలా తీసినా.. మూలధనం లేకపోయినా ఇలాంటి సందర్భంలో గరిష్టంగా రూ. 5 లక్షల వరకే మీకు వెనక్కి వస్తుంది. అంతకుమించి చేసిన డిపాజిట్లపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇది ఒకవేళ బ్యాంక్ దివాలా తీసినప్పుడు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.