అధ్యక్ష ఎన్నికల వేళ అగ్రరాజ్యం అమెరికాలో అభ్యర్ధులపై దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హ్యారిస్ ఎన్నికల ప్రచార కార్యాలయంపై దుండుగులు కాల్పులకు పాల్పడ్డారు. ఆరిజోనాలోని డెమొక్రాటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి తుపాకులతో దాడి చేశారు. పార్టీ ఆఫీసులోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనుమానితులు కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు.
టెంపే పోలీస్ మీడియా అధికార ప్రతినిధి సార్టెంట్ ర్యాన్ కుక్ మాట్లాడుతూ.. ‘కాల్పుల జరిగిన సమయానికి కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.. ఈ ఘటనలో కార్యాలయం పాక్షికంగా ధ్వంసమైంది.., ఏ ఒక్కరికీ కూడా గాయం కాలేదు.. ఈ ఘటనతో పార్టీ ప్రచార కార్యాలయంలోని సిబ్బంది, దాని పరిసరాల్లో ఉండేవారి భద్రత గురించి ఆందోళన కలిగిస్తోంది’ అని చెప్పారు. భవనం ముందు ద్వారం తలుపు, రెండుకుపైగా కిటికీలకు బుల్లెట్ రంధ్రాలైన వీడియోలు స్థానిక టీవీ ఛానెల్స్‌లో ప్రసారం అవుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో గోల్ఫ్ ఆడుతుండగా ట్రంప్‌పై ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. ఫెన్సింగ్ వద్ద నుంచి తుపాకీతో దూసుకొస్తున్న నిందితుడ్ని గమనించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపి అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి. జులైలో పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవి పక్క నుంచి తూటా దూసుకువెళ్లింది. తాజాగా, కమలా హ్యారిస్ ఎన్నికల ప్రచార కార్యాలయంపై కాల్పులు జరగడం సంచలనంగా మారింది.
కాల్పుల ఘటనపై ఆరిజోనా డెమొక్రాటిక్ పార్టీ ఛైర్‌ఉమెన్ యోలాండా బెజరానో ఓ ప్రకటన విడుదల చేశారు. ‘అరిజోనా డెమొక్రాటిక్ పార్టీ కార్యాలయంపై కాల్పులు జరగడం చాలా విచారకరం.. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాం.. మా సిబ్బంది భద్రత కోసం పోలీసులు, దర్యాప్తు అధికారులతో కలిసి పని చేస్తున్నాం’ అని ఆమె అన్నారు. శుక్రవారం ఆరిజోనాలో కమలా హ్యారిస్ ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. దీనికి మూడు రోజుల ముందే పార్టీ ప్రచార కార్యాలయంపై కాల్పుల జరగడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు.